3537* వ రోజు ....

 ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!

22.07.2025 మంగళవారం 3537* వ రోజు నాటి స్వచ్చోద్యమ నేపధ్యం!

         హైవేకు ఆనుకుని ఉన్న గంగులవారిపాలెం రోడ్లో వేకువ జామున 4.15 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు పని ప్రారంభించారు. గంగులవారిపాలెం రోడ్డు మొదట్లో నుండి రెండు ప్రక్కల కార్యకర్తలు అంతకుముందు పెట్టిన రకరకాల మొక్కలు చుట్టూ ఉన్న కలుపును గడ్డిని పిచ్చి మొక్కలను లాగేసినారు.

         గంగులవారిపాలెం రోడ్డుకు రెండు వైపులా అటు కొంతమంది కార్యకర్తలు ఇటు కొంతమంది కార్యకర్తలు కొద్ది దూరం చాలా శుభ్రంగా తయారుచేశారు. ఒక కార్యకర్త కటింగ్ మిషన్ చేతబట్టి ఇప్పటి వరకూ అనగా 2-3 నెలల పాటు ఎరుపు పసుపు పూలు దట్టంగా పూసి స్వాగత ద్వారం వద్ద నుండి దారి పొడవునా ఎంతో కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచి అలసిపోయిన అడవి తంగేడు (గద్దగోరు) మొక్కలను కొత్త చిగురు రావడం కోసం మధ్యలోకి సమానంగా కత్తిరించారు.

         మరికొంతమంది కార్యకర్తలు కత్తిరించిన గద్దగోరు కొమ్మలను ట్రాక్టర్ లో లోడ్ చేసి ఆ దారిని శుభ్రపరిచారు. 6 గంటల సమయానికి విజిల్ మ్రోగగానే 21 మంది కార్యకర్తలు పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన సమయాన ఒకరినొకరు మనసారా పలకరించుకొని, చతుర్లాడుకొంటూ కొద్ది నిమిషాలు చేసిన కష్టాన్ని మరచి సమీక్షలో పాల్గొన్నారు.  

         కస్తూరి విజయ్ కుమార్ పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి అందరూ గొంతు కలిపి,

         రేపు కలువవలసిన ప్రదేశం ఇక్కడే అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాసరావు

  ప్రజా కళాకారుడు

  22.07.2025.

 

చల్లపల్లిలో వృక్ష విలాపం –8

(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)

చెట్లు నరుకుట, పూలు త్రెంచుట, పచ్చదనమును పరిహసించుట,

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమను బూడిద పాలు చేయుట,

సృష్టినే అవమానపరచుట, సుందరతనే వెక్కిరించుట.......

ఇప్పటికి ఇది మీ ప్రలాపము-ముందుముందది మీవిలాపము !

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   22.07.2025