ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
24.07.2025 గురువారం 3539* వ రోజు నాటి స్వచ్చోద్యమ కధనం!
తెల్లవారుజాము 4.10 నిమిషాలకు స్వచ్చ సుందర చల్లపల్లి బోర్డు వద్ద 8 మంది కార్యకర్తలు ఫోటో దిగి ఆ తరువాత వారివారి పనిముట్లు చేతబట్టి పని ప్రారంభించారు.
గంగులవారిపాలెం రోడ్ లోని కొంత భాగంలో కలుపు, పిచ్చి మొక్కలు, గడ్డిని లేకుండా చేసి మొక్కలు ఎదగడానికి వీలు కల్పించారు. ట్రస్టు కార్మికులు నిన్న కొన్ని అడవి తంగేడు మొక్కలకు రక్షణగా కంప పాతగా ఈరోజు కొద్ది మంది కార్యకర్తలు ఆ కంపను తాడుతో కట్టి పకడ్బందీగా రక్షణ ఏర్పరిచారు.
ఒకరిద్దరు కార్యకర్తలు స్వాగతద్వారంనకు రెండవ వైపు ఉన్న అడవి తంగేడు పూల చెట్లను సగభాగం కత్తిరించారు. హైవే రోడ్ లోని మార్జిన్ లో మిగిలి ఉన్న కొంతభాగాన్ని ఒక కార్యకర్త గడ్డి కోత యంత్రంతో కత్తిరించారు. కార్యకర్తలు కోసిన గడ్డిని కొంతమంది మహిళామణులు గొర్రులతో లాగి గుట్టలుగా చేర్చడం జరిగింది.
వర్షం వచ్చే ముందులాగా వాతావరణం చల్లగా ఉండడంతో కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా పని చేయడం జరిగింది.
6 గంటలు దాటినా కూడా కార్యకర్తలు పని ఆపకుండా లోడింగ్ పూర్తి చేసిన తదుపరి పనికి విరామమిచ్చి ఆసుపత్రి సిబ్బందిలో ఒక్కరైన స్వచ్చ కార్యకర్త ‘కృష్ణ’ “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి,
రేపు కలువవలసిన ప్రదేశం కూడా ఈ “స్వాగత ద్వారం” వద్దనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాసరావు
ప్రజా కళాకారుడు
24.07.2025.
చల్లపల్లిలో వృక్ష విలాపం – 10
(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)
మొక్క నాటే- నీరుపోసే-ముళ్ళకంచె అమర్చుచుండే
పాదుత్రవ్వే- కన్నబిడ్డల వోలె వాటికి ప్రేమ చూపే
స్వచ్ఛసుందర కార్యకర్తల కాయ కష్టం మరచి పోయిన
పూలదొంగల – వృక్ష హంతక శ్రేణులారా! ఇదె మావిలాపం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
24.07.2025