ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
25.07.2025 శుక్రవారం 3540* వ రోజు నాటి విశేషాలు!
తెల్లవారుజాము 4.12 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్డులోని మురుగు కాలువ వంతెన వద్ద 8 మంది కార్యకర్తలతో ఈరోజు శ్రమకు సిద్ధమయ్యారు.
వంతెన వద్ద నుండి ఆసుపత్రి వైపు ఉన్న, నిన్నటి వరకు రంగురంగుల పూల సోయగాలతో అందాలను పంచినట్లు అడవి తంగేడు చెట్లు కొత్త ఇగుర్లు వచ్చి తిరిగి అలా పూలు రావాలంటే వాటిని పూత అయిన తరువాత కత్తిరించడం అనివార్యం. దానిలో భాగంగానే ఒక కార్యకర్త కటింగ్ యంత్రంతో వాటిని కత్తిరించడం జరిగింది.
అలా కట్ చేసిన కొమ్మలను కొద్ది మంది కార్యకర్తలు డ్రైనేజి అంచున మట్టిని కొట్టుకుపోనీకుండా కాపాడడానికి వేయాలని ఆ కొమ్మలను దొంతరాలుగా పెట్టారు.
నిన్న గంగులవారిపాలెం రోడ్డులో మిగిలిన పనిని కొద్దిమంది కార్యకర్తలు పూర్తి చేసివచ్చారు. అంతకుముందు ఈ దారి డ్రైనేజి వలన పూర్తిగా కోతకు గురై కాలిబాటలాగా మాత్రమే ఉండేది. తారురోడ్డు నిర్మాణం జరిగిన తరువాత కూడా మార్జిన్ లు కొట్టుకుపోయి చాలా ప్రమాదభరితంగా ఉండేవి.
స్వచ్ఛ కార్యకర్తల ఏళ్ల తరబడి చేసిన కష్టం ద్వారా అనగా ఎక్కడెక్కడి నుండో తాటిబొండ్లు అడ్డంగా పెట్టి, శీలలు దిగ్గొట్టి ఊరిలో అక్కడక్కడా ప్రక్కన పడవేసిన రాతిముక్క, బండరాళ్ళు, డ్రైనేజి పూడిక తీయగా వచ్చిన మట్టిని అంచున వేసి దారి పొడవునా మొక్కలు పెంచుట వలన ఈరోజు ఆదారి అందరికీ అంత సౌకర్యంగా ఉండి అనేక మందికి “ఉదయపు నడక” కు ప్రధాన రహదారి అయింది.
జాతీయరహదారి నుండి చల్లపల్లి ప్రవేశించడానికి ఎక్కువ మంది ఈ దారినే వస్తున్నారంటే దశాబ్దకాలం పైగా జరుగుతున్న నిస్వార్ధమైన స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం, స్వచ్ఛ కార్యకర్తలు చేస్తున్న నిరంతర శ్రమ దీనికి కారణాలు.
6 గంటల వరకు పనిచేసి విజిల్ మ్రోగిన తరువాత పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప 18 మంది కార్యకర్తల సమీక్షలో పాల్గొని జాస్తి జ్ఞాన ప్రసాదు గారు చెప్పిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి గొంతు కలిపి ‘సాధిస్తాం సాధిస్తాం’ అంటూ నినదించారు.
ఈరోజు చందోలు నుండి గుడివాడ వెళ్తున్న అమెరికాలో స్థిరపడిన గుడివాడ వాస్తవ్యులు శ్రీ నంద గోపాల్ గారు మన కార్యకర్తలను చూసి కారు దిగి, చేతికి గ్లౌజులు ధరించి ట్రాక్టర్ లోడింగ్ పనిలో పాల్గొనడం చాలా గొప్ప విషయం. మన స్వచ్ఛ సేవలో ఇలా వచ్చి చేరడం ఇది రెండోసారి.
రేపు కలువవలసిన ప్రదేశం ఈరోజు ఆగిన చోటు అని అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాసరావు
ప్రజా కళాకారుడు
25.07.2025.
పునాదులుగా పుట్టి పెరిగిన
పైకి జోకులు వేసుకొన్నా, పకపకలుగా సాగుతున్నా,
“టైమ్ పాస్” అని కొందరన్నా, వినోదం అని పించుచున్నా -
ఊరి దుస్థితి చూసి వేదన, ప్రజా సౌకర్యాల కల్పన
పునాదులుగా పుట్టి పెరిగిన స్వచ్ఛ - సుందర ఉద్యమం ఇది!
“స్వచ్ఛ సుందర చల్లపల్లి” అని సార్ధకముగా నడచు ముచ్చట!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
25.07.2025