3542* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

27.07.2025 శనివారం 3542* వ రోజు నాటి  శ్రమైక జీవన సౌందర్యం! 

         వేకువ జాము 4.15 నిమిషాలకు 9 మంది స్వచ్చ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి ముందు రహదారి శుభ్రం చేసే పనిని ప్రారంభించారు. ప్రతిసారీ విజయ పబ్లిక్ స్కూల్ లో మెడికల్ క్యాంపు జరిగే రోజు మన కార్యకర్తలు ఆ రోజు పని ఆ ప్రదేశంలో చేయడం ఆనవాయితి. కాబట్టి స్కూల్ వెనుక బజారు అనగా ప్రభుత్వ ఆసుపత్రి రహదారి శుభ్రత ఈ రోజు ప్రధాన ఘట్టం.

         నలుగురు కార్యకర్తలు కొద్ది సేపు మెడికల్ క్యాంపు లోపల ప్రాంగణం శుభ్రం చేసి ఆ తదుపరి రహదారి శుభ్రత లో పాల్గొన్నారు. దారికి అటు ఇటు ఉన్న నీడ నిచ్చు చెట్టు కొమ్మలు పెరిగి రోడ్డుకు అడ్డుగా రావడంతో వాటినీ, దారి అంచున ఏపుగా పెరిగిన కలుపూ, గడ్డిని శుభ్రం చేశారు.

         కొద్దిమంది కార్యకర్తలు శుభ్రం చేయగా వచ్చిన తుక్కును ట్రాక్టర్ లో లోడ్ చేయగా, మహిళా కార్యకర్తలు దారిని చీపుళ్లతో శుభ్రం చేయగా ఆ రహదారి ఈ రోజు చాలా సుందరంగా కనిపించింది. కొద్ది మంది కార్యకర్తలు ఎప్పటిలాగానే వైద్య శిబిరానికి వెళ్ళి వారి వారి అమూల్యమైన సేవలు అందించారు.

         6 గం.ల వరకు పరిశ్రమించిన 23 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి, కాఫీ సేవించిన పిదప కొద్ది విరామం తరువాత ఈ రోజు స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న BSNL నరసింహా రావు గారు పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లి”  నినాదాలకు బదులిచ్చి,

         రేపు కలవవలసిన ప్రదేశం “ గంగులవారిపాలెం” దారిలోని మురుగు కాలువ వంతెన సమీపంలోనే అనుకుని నిష్క్రమించారు.

నందేటి శ్రీనివాస్

ప్రజా కళాకారుడు   

   27.07.2025.

        సహన గుణమును నేర్వవలదా?

ఊరు మొత్తం సమూలముగా ఉత్తమంగా మారుటంటే 

చల్లపల్లిలో సాగినట్లుగ శ్రమకు ఫలితం దక్కుటంటే

ప్రజల మధ్యన చర్చ వలదా? ప్రజామోదం లభించొద్దా?

సహన గుణమును నేర్వవలదా? సాహసము చూపెట్టవలదా?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   27.07.2025