పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
29.07.2025 మంగళవారం 3544* వ రోజు నాటి శ్రమదాన స్వరూపం!
గంగులవారిపాలెం రోడ్డులోని వేకువజాము 4:11 నిమిషాలకు 12 మంది కార్యకర్తలతో పని ఆరంభించడం జరిగింది. మురుగు కాలువ వైపు ఉన్న మామిడి మొక్కలలో, తీగజాతి మొక్కలలో ఉన్న కలుపును శుభ్రం చెయ్యడం, రోడ్డు క్రింది భాగంలో డ్రైనేజి అంచును తుక్కు, గడ్డితో అంచు కట్టడం ఒక ప్రణాళికాబద్దంగా పనులు చేస్తూ ఉన్నారు.
రోడ్డు అంచున మార్జిన్ లో ఉన్న గడ్డిని కార్యకర్తలు కత్తులతో కాకుండా గడ్డి కటింగ్ మిషన్ తో ఒక కార్యకర్త కట్ చేస్తున్నందున ఆ ప్రాంతం రోడ్డు చాలా వెడల్పయినట్లుగా ఎంతో అందంగా పదేపదే చూడాలనిపిస్తుంది. హైవే పై పని చేస్తూ ఈ దారికి కార్యకర్తలు కొంతకాలం విరామం తరువాత రావడంతో కలుపు గడ్డి, పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగినవి. ఇప్పుడు ఈ రోడ్డు శ్రామికులు పని చేస్తుంటే గాలి వెలుతురుకు నోచుకొని మొక్కలకు స్వేచ్చా వాయువులు ప్రసాదించినట్లయింది.
6 గంటల వరకూ పనిచేసిన 20 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే కాఫీ కబుర్లతో కొద్ది నిమిషాల పలకరింపుల అనంతరం సమీక్షా సమావేశంలో తమ కుమారుని వివాహమునకు మనందరినీ ఆహ్వానించుటకు వచ్చిన తూములూరి లక్ష్మణరావు గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జైకొట్టి కార్యకర్త కుమారుని పెళ్ళికి 31 తేదీ రాత్రి హాజరవుదాం అనుకుని,
రేపు కలవవలసిన ప్రదేశం కూడా ఈదారి మలుపులో అని నిర్ణయించుకుని నిష్క్రమించిరి.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
29.07.2025.
అల్లాటప్పా పనులని
అల్లాటప్పా పనులని అవహేళన అసలు వలదు
స్వార్థానికి శ్రమదానము వాడుకొనే తెలివి వలదు
లేక లేక శిరసెత్తిన ఈ మహోత్తమోద్యమాన్ని
విస్తరించవలసిన ఆవశ్యకతను మరువ వలదు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
29.07.2025