పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
31.07.2025 - 3546* వ రోజు నాటి స్వచ్చ సేవల తీరు తెన్నూ ఎట్టిదనిన!
గంగులవారిపాలెం రోడ్ (స్వాగతద్వారం – పద్మావతి ఆసుపత్రి) లో రెండవ ప్రక్క అనగా గద్దగోరు మొక్కల వైపు, క్రింది భాగంలో పనిచేయుటకు 4:12 నిమిషాలకే 10 మంది కార్యకర్తలు కార్మోనుఖులయ్యారు. మొక్కలకు, దిగువన ఉన్న పంట చేనుకు మధ్యన ఉన్న భాగంలో దట్టంగా పెరిగిన గడ్డిని కలుపునూ కార్యకర్తలు తొలగించి ఒడ్డుకు వేయడం, మొక్కలకు పై భాగం అనగా రోడ్డు మార్జిన్ మాత్రం మిషన్ కటింగ్ కు కేటాయించారు. పని చేసిన తరువాత వచ్చిన గడ్డి, కొమ్మలను కొద్దిమంది యువ కార్యకర్తలు చేతులతో పెద్ద పెద్ద గుట్టలు పట్టి మురుగు కాలువ వైపు అంచును బలం చేశారు.
కొంతమంది కార్యకర్తలు రోడ్డు మలుపులో ఎక్కువగా ఉన్న పనిని పూర్తి చేయాలని డ్రైయిన్ వైపున పూర్తిగా శుభ్రం చేశారు. గత నెల రోజుల పైగా మన దగ్గర ఉన్న గడ్డి కోత యంత్రాలకు మాత్రం ఒక కార్యకర్త ఊపిరాడకుండా వాటికి పనిచెప్పడం జరుగుతుంది. 30 మందికి పైగా కార్యకర్తలు సందడిసందడిగా మాట్లాడుకొంటూ ఊరి బాగు కోసం ఆ సమయంలో వేరు వేరు పనిముట్లను, ప్రయాణికులనూ పట్టించుకోకుండా అవిశ్రాంతంగా పనిచెయ్యడం చూస్తుంటే ఆ సమయంలో ఇది ఎక్కడా చూడని, చూడలేని అరుదైన, అద్భుతఘట్టంగా అనిపిస్తుంది.
రోజూ పని ముగించే సమయం దాటినా సరే మహిళా కార్యకర్తలు రోడ్డంతా ఊడ్చి, శుభ్రం చెయ్యడం, కత్తిరించిన కొమ్మలను పూర్తిగా అక్కడి నుండి తీసివేసి బాటసారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చెయ్యడం నిజంగా స్వచ్చ కార్యకర్తల సమయ శ్రమ త్యాగంతో పాటు వారిలో ఉన్న మానవీయ కోణం అందరికీ అర్ధమవుతుంది.
విరామమెరుగక పరిశ్రమించే కార్యకర్తలు 6 గంటల సమయం దాటిన తరువాత పనిని ముగించి చేతులు శుభ్రపరుచుకుని కాఫీ కప్పులు చేతబట్టి ఈరోజు పని జరిగిన తీరును ముచ్చటించుకొంటూ సమీక్షకు నడిచారు.
సమీక్షా సమావేశంలో రామకృష్ణ “జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి గొంతు కలిపి జై కొట్టారు.
డాక్టరు గారు మాట్లాడుతూ కార్యకర్తలు అంత శ్రద్ధతో ఊరికి అంకితమై పనిచేస్తుంటే సమయానికి ఆపమని చెప్పడానికి నా విజిల్ మ్రోగడం లేదు అంటూ ఈరోజు జరిగిన పనిని ఉద్దేశించి ఛలోక్తి విసిరారు.
ఈరోజు లక్ష్మణరావు గారి కుమారుని వివాహమునకు హాజరవ్వాల్సిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ,
రేపు కలువవలసినది ఈ ప్రదేశమే అనుకుని ఇంటి బాట పట్టారు.
శ్రమజీవే జగతికి మూలం
చెమటోడ్చక జరగదు కాలం
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
31.07.2025.
శ్రమకు పట్టం కట్టిరిచ్చట –
దశాబ్దంగా – నాల్గు లక్షల గంటల శ్రమ జరిగె నిచ్చట
శ్రమకు పట్టం కట్టిరిచ్చట – స్వచ్ఛ శుభ్రత వెలసె నిచ్చట
మురుగు కాల్వలు, రుద్ర భూములు హరిత శోభ వెలార్చె నిచ్చట!
ఒక శతాధిక కార్యకర్తల ఉద్యమం కొనసాగె నిచ్చట!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
31.07.2025