పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
03.08.2025 ఆదివారం - 3549* వ రోజు నాటి స్వచ్చ సేవా కార్యక్రమాలు!
తెల్లవారు జామున 4:15 నిమిషాలకు 9 మంది కార్యకర్తలు గంగులవారిపాలెం దారి మలుపులో ఫోటో దిగి పనిముట్లను చేత బట్టి గ్రామ సేవకు సిద్ధమవగా కొందరు బండ్రేవు కోడు కాలువ కట్ట క్రింద కొంతభాగం చేయుటకు వెళ్ళగా మరికొంతమంది గంగులవారిపాలెం దారిలో (ఆసుపత్రి వైపు) ఎడమ ప్రక్క డ్రైను వెంట ఉన్న చెత్తా చెదారాలు, ముళ్ల కంప, పిచ్చి తీగలను నరికివేసి బాగు చేసుకుంటూ కార్యకర్తలు నాటిన మొక్కలను బయటకు తీశారు.
ఒకరిద్దరు పని చేసిన భాగంలో రోడ్డు మార్జిన్ లో అక్కడక్కడా ఉన్న గడ్డిని బాగు చేస్తూ శుభ్రంగా తయారు చేశారు. ఒక్కొక్కరు వచ్చి చేరుతూ మొత్తం 34 మంది కార్యకర్తలు ఆ దారిని ఎంతో అందంగా తయారు చేశారు.
ఆదివారం కావడంతో అందరూ సమయాన్ని మరచిపోయి ఎంతో ఉత్సాహంగా ఈ యజ్ఞంలో పనిచేయడం , పని పూర్తయిన భాగాన్ని ఒకసారి చూసి సంతోషించడం స్వచ్చ కార్యకర్తలకు దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మారింది. ప్రారంభించిన ప్రతి చోటా ఆగిపోయిన స్వచ్చంద సేవలు ఒక్క చల్లపల్లిలో 10 ½ సంవత్సరాలుగా నిరంతరాయంగా జరగడం స్వచ్చ కార్యకర్తల పట్టుదలకు నిదర్శనం, అందుకే వారు ప్రతిరోజూ స్వచ్చ సుందర చల్లపల్లి అనగానే సాధిస్తాం సాధిస్తాం అంటూ ముమ్మారు పలుకుతారు.
6 గంటలు దాటిన తరువాత విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చిన కార్యకర్తలు కాఫీ సేవించిన పిదప సమీక్షలో తోట నాగేశ్వర రావు గారు పలికిన "జై స్వచ్చ సుందర చల్లపల్లి " కి జై కొట్టారు.
రేపు ఉదయం 9 గంటలకు మేళ్ళమర్తిలంక గ్రామంలో జరగబోతున్న గంగానమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి స్వచ్చ కార్యకర్తలందరూ రావలసినదిగా లంకబాబు గారు స్వయంగా ఆహ్వానించడం జరిగింది.
రేపు కలవవలసిన ప్రదేశం సన్ ఫ్లవర్ స్పెండర్ సిటీ దారి మొదట్లో అనుకొని తిరుగు పయన మయ్యారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
03.08.2025.
స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల ప్రత్యేకత
కలలు గనుట తప్పుగాదు - ఖరీదైన, శ్రేష్ఠమైన,
జనబాహుళ్యానికి కడు శ్రేయోదాయకమైనవె
స్వప్నించుట – కష్టించుట - సాధించుంటె స్వచ్ఛ చల్ల
పల్లి కార్యకర్తల ప్రత్యేకతలని చెప్పగలను!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
03.08.2025