3550* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

04.08.2025 సోమవారం - 3550* వ రోజు నాటి స్వచ్చోద్యమ ఘట్టములు!

          ఈరోజు తెల్లవారుజాము 4:14 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్డులో సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ రోడ్డు క్రాసింగ్ వద్ద 10 మంది కార్యకర్తలు మొదటి ఫోటో దిగి ఈరోజు సేవలకు శ్రీకారం చుట్టారు. ఎప్పటిలాగే ఎవరి పనిముట్లు వారు చేతపట్టి వారు చేసే పనులతో ముందుకు వెళుతున్నారు. ఈ రోడ్ లో కొన్ని బెంబేడు, రుద్రాక్ష చెట్లు బాగా ఎత్తు పెరిగి తీగల వద్దకు, కొన్ని ముందుకు వంగి రోడ్డు ప్రక్క డ్రైను మీదికి వాలిపోగా వాటిని సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు.

          మిషన్ కోత రంపం స్టార్ట్ చెయ్యగానే ఇంజన్ లో అంతరాయం ఏర్పడి మొరాయించింది. కష్టాలున్నాయనే సాకుతో మన ముందున్న కర్తవ్యాలు బాధ్యతలు మరువరాదనే సుందరయ్య గారి సూక్తి ప్రేరణతో మిషన్ రంపం ప్రక్కన పెట్టిన కార్యకర్తలు పొడవాటి, బరువు గల కత్తులను ట్రాక్టర్ లో నుండి తెప్పించుకుని ఎంతో కష్టమయిన పనిని మొండితనంగా వాటిని నరికి ట్రక్కు పైగా కొమ్మలను కిందికి వేశారు. మరికొంతమంది కార్యకర్తలు వాటిని చిన్నవిగా విడగొట్టి ట్రాక్టర్ లో లోడ్ చేశారు.

          వాటిని బండ్రేవుకోడు మురుగు కాలువ గట్టు క్రింది భాగంలో రక్షణ గోడ వేయాలని నిర్ణయించారు. ఇంత పని చేయగా కొమ్మలు మూసుకుపోయి చీకట్లు కమ్మిన ఆ ప్రాంతము పని చేసిన తరువాత వెలుతురుతో నిండింది. మరో ఇద్దరు కార్యకర్తలు అల్స్టోనియా (Alstonia Scholaris) మొదళ్ళ నుండి క్రిందికి పడిపోయిన తీగజాతి పూల మొక్కలను పైకి పాకే ఏర్పాట్లకై తాడుకట్టి కంప పాతి సంరక్షించారు.

          6 గంటల వరకు చేసినంత ప్రదేశము పనిని శుభ్రంగా ఊడ్చి చూడటానికి అందంగా తయారుచేశారు. విజిల్ మ్రోగగానే 17 మంది కార్యకర్తలు సమీక్షలో పాల్గొని దేసు మాధురి గారు పలికిన “స్వచ్చ చల్లపల్లి” నినాదములకు జేజేలు పలికారు.
          గురువారం ఉదయం 7 గంటలకు NTR పార్కులో జరిగే ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవానికి రమ్మని మనల్ని ఆహ్వానించుట బంకు పూర్ణ, పాలడుగు రత్నకుమార్ గార్లు వచ్చి చెప్పటం జరిగింది.

          ఈలోగా మన పంచాయితీ పూర్వపు కార్యదర్శిగా పనిచేసిన మనందరికీ సుపరిచితులు శ్రీ బొల్లినేని ప్రసాద్ గారు వారి కుటుంబంతో వేరే పని మీద వెళుతూ ఈ మార్గంలో స్వచ్చ కార్యకర్తలు కనిపించగా ఆగి స్వచ్చ చల్లపల్లి యోగక్షేమాలడిగి అందరితో కొద్దిసేపు ముచ్చటించారు.

          తదుపరి రేపటి మన కార్యక్రమానికి  సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ రోడ్డులో కలుద్దాం అనుకొని ఇంటి బాట పట్టారు.

          అందరొక్కటై ఒక్కరందరై అడుగిడు శుభ సమయం ఏదో!

- నందేటి శ్రీనివాస్

   ప్రజా కళాకారుడు  

 

   04.08.2025.