3551* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

05.08.2025 మంగళవారం – 3551* వ రోజు నాటి స్వచ్చ చల్లపల్లి శ్రమదాన ఘట్టములు!

          ఈరోజు వేకువజాము 4:07 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు గంగులవారిపాలెం రోడ్ లోని సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ క్రాస్ రోడ్డు వద్ద ఫోటో దిగి పనికి కార్మోనుఖులయ్యారు. నిన్న జరిగిన పనికి కొనసాగింపుగా దారి ప్రక్కన ఇటీవలి వరకూ మొక్కకు మించి రంగురంగుల పూలు పూసి అలసిపోయిన గద్దగోరు కొమ్మలను, ఎక్కువ మొక్కలతో బరువెక్కిన  బోగన్ విలియా కొమ్మలనూ పూల మొక్కల పైకి వంగిన అనేక రకాల చెట్ల కొమ్మలను కత్తిరించుకుంటూ ముందుకు సాగారు.

          కత్తిరించిన కొమ్మలను కొందరు క్రమపద్ధతిలో మండి తొక్కి అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశంలోకి తరలించారు. అక్కడ షెడ్డర్ యంత్రంలో వేయాలని నిర్ణయించారు. కొందరు మాత్రం మార్జిన్ లో ఉన్న కలుపు గడ్డిని శుభ్రం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

          మరొక 1,2 రోజులలో ఈ పని స్ప్లెండర్ సిటీ దారి వరకూ పూర్తికావచ్చు తదుపరి తిరిగి హైవేకు వెళ్లవలసి ఉంటుంది. ఈదారి కార్యకర్తలు పని చేస్తున్న కొద్దీ ఎంతో అందంగా చూడ ముచ్చటగా ఉంది. వాతావరణంలో వేడి వలన స్వచ్చ కార్యకర్తలు పని చేస్తున్నంత సేపు చెమటతో తడిసి ముద్దవుతున్నారు.

          6 గంటలు దాటగనే విజిల్ మ్రోతకు కార్యకర్తలంతా పనికి విరామమిచ్చి కొద్ది సేపు కాఫీ విరామం తరువాత సమీక్షలో పాల్గొన్న 25 మంది పల్నాటి అన్నపూర్ణ గారి జై స్వచ్చ సుందర చల్లపల్లి కి జై కొట్టి,

          రేపు మనం కలువవలసినది NTR పార్కు వద్ద అనుకొని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

   ప్రజా కళాకారుడు  

   05.08.2025.

 

(కృష్ణశాస్త్రి శైలిలో ఐతే) – 1

స్వచ్ఛ సుందరోద్యమం ఒక అమృతగీతం

ఔను- కవిత్వం నాప్రాణం నిరంతరం పలికే రాగం

కాని- జీవితం నా అంతరాత్మ ప్రకాశం

చల్లపల్లి వీధుల్లో- గ్రామస్తుల గుండెల్లో

గుబాళిస్తున్న నూతన యుగ మందార సుమ సుగంధం!

 

విసిగిపోయాను ప్రచార కంఠాల కాలంచెల్లిన రాగాలతో

పదవుల సంకెళ్లలో బందీతౌతున్న బ్రతుకులతో

స్వార్థపు సంకెళ్లు బిగిసిన ఆత్మలతో!

ఇవా మానవత్వం పయనించవలసిన దారులు ?

ఇప్పుడు కావలసినవి జనం పట్ల ప్రేమనిండిన రహదారులు!

 

ఈ ప్రతి స్వచ్ఛసైనికుని చేతి చీపురే

స్వార్ధం బలిసిన ఈనాటి అజ్ఞానాంధకార వినాశిని!

మాసిన - దుమ్ము నిండిన బట్టల్లో అతడే

నూతన యుగ తెలి వెన్నెల కిరణం!

ప్రతితొలి సంధ్యాపూర్వం పడే అతని అడుగులతో

ఈ చల్లపల్లి ఒక నవ వికసిత పుష్పోద్యానం!

(సశేషం)

 

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   05.08.2025