3552* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

06.08.2025 బుధవారం – 3552* వ రోజు నాటి శ్రమదాన సన్నివేశములు!

          తెల్లవారు జామున 4:23 నిమిషాలకు 11 మంది కార్యకర్తలతో ముందుగా అనుకున్న ప్రకారం NTR పార్కులో పని ప్రారంభించారు.

          రేపు ఉదయం NTR పార్కులో జరగబోయే నూతన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ ప్రాంగణమంతా అందంగా తయారు చేసే పని స్వచ్చ కార్యకర్తల వంతయ్యింది. పార్కు అభివృద్ధిలో భాగస్వాములవుతున్న చాలా మంది ఉదయపు నడక మిత్రులు చల్లపల్లి ప్రజల సౌకర్యార్ధం ఈ ఓపెన్ జిమ్ నిర్మించారు.

          NTR పార్కు ప్రవేశ ద్వారం లోపలి వైపు నుండే విపరీతంగా గడ్డి మొలిచి NTR పైలాన్ చుట్టూ గడ్డి బీడు లాగ దట్టంగా పట్టడం వలన చూడడానికి ఆ ప్రదేశమంతా అందవికారంగా ఉంది. ఎక్కువ మంది కార్యకర్తలు కత్తులు చేతబట్టి పైలాన్ చుట్టూ చాలా అందంగా చేశారు. మరికొంతమంది మిషన్ తో సభావేదిక ముందు భాగం గడ్డిని చక్కగా కత్తిరిస్తున్నారు. సమయం గడచిన కొద్దీ స్వచ్చ కార్యకర్తలు, ఉదయపు నడక మిత్రులతో పార్కు ప్రాంగణమంతా సందడిగా ఉంది.

          ఎట్టకేలకు బాగుచేసిన తుక్కును అందరూ కలిసి ట్రాక్టర్ లో లోడ్ చేయగా 6 గంటల తరువాత రధసారధుల వారి ఈల మ్రోగగానే అందరూ నేటి స్వచ్చోద్యమానికి సెలవిచ్చి చేతులు శుభ్రం చేసుకుని కాఫీ సేవిస్తూ కొద్ది నిమిషాలు సేద తీరారు.

          అనంతరం జరిగిన సమీక్షలో అంబటి బసవ శంకర్రావు గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి” నినాదానికి జేజే లు పలికి,

          పార్కు ముందు భాగంలో డ్రైనేజికి తూములు ఏర్పాటు చేసి దానికి పార్కు పొడవునా వాహనాలు నిలుపుకొనుటకు కేటాయిస్తే బాగుంటుందని డాక్టర్ గారు సూచన చేశారు.

          రేపు ఉదయం ఓపెన్ జిమ్ కార్యక్రమానికి కార్యకర్తలంతా రావాలని పెద్దలు కార్యకర్తలకు మరొక్కసారి గుర్తు చేశారు.    

          రేపు కలువవలసిన ప్రదేశం NTR పార్కులోనే అని సమీక్ష విరమించారు.

- నందేటి శ్రీనివాస్

   ప్రజా కళాకారుడు  

   06.08.2025.

 

(కృష్ణశాస్త్రి శైలిలో ఐతే) – 2

స్వచ్ఛ సుందరోద్యమం ఒక అమృతగీతం

(మళ్ళీ నిన్నటి తరువాయి)

ఓ స్వచ్ఛ సుందరోద్యమ కర్తా!

పన్నెండేళ్లుగా ఎండ వేడిని ఓర్చావు

వానచినుకుల్లో నానావు

నీ చెమట చుక్కల్ని చల్లపల్లి భూతలాని కర్పించావు.

నీ ఊరును స్వస్త శుభ్రంగా మారుస్తున్న నీ నిరంతర యజ్ఞం

ఒక విశాల పురాతన గ్రామ చరిత్ర పుటల్లో వికసిస్తున్న అమృత పుష్పం

వీధిచెత్తను ఏరుతున్న నీ చేతులే

ఫలిస్తున్న మానవతా మధుర స్వప్నం!

నువ్వు పంచుతున్న చిరునవ్వుల్లో

తరతరాల అనురాగం - శాశ్వత బాంధవ్యం!

(సశేషం)

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   06.08.2025