పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
07.08.2025 గురువారం – 3553* వ రోజు నాటి సంగతులు!
నేడు NTR పార్కులో తెల్లవారుజామున 4:20 నిమిషాలకు 17 మంది కార్యకర్తలు పార్కు బయట ప్రహరీ గోడ పొడవునా అపరిశుభ్రతను తొలగించడానికి నడుం బిగించారు. ఈరోజు కార్యకర్తలు నాలుగైదు బృందాలుగా ఏర్పడి పని చేశారు.
మెస్ బయట ప్రక్కన బాగా దట్టంగా పెరిగిన దర్భ గడ్డిని కొడవలితో మొదలు కంటూ కోసి పరిశుభ్రపరుస్తున్నది ఓ మహిళా కార్యకర్త.
కొంతమంది కార్యకర్తలు కొత్తగా పార్క్ లోపల ఏర్పాటు చేసిన ‘ఓపెన్ జిమ్’ ప్రారంభం ఉంటుందని షటిల్ కోర్టు ముందర నిన్న బాగుచేయగా మిగిలిన ప్రాంతాన్ని ఈరోజు కొందరు పూర్తి చేయడం, మరి కొంతమంది పార్కు పొడవునా రోడ్డు మార్జిన్ బాగు చేయడం, ఊడ్చి అందంగా తయారుచేయడం మరికొందరు గడ్డి పోగులను, చెత్తను ట్రాక్టర్ లో లోడ్ చేయడం జరిగింది.
ఈరోజు కూడా కొంతమంది ఉదయపు నడక మిత్రులు “ఉత్సాహంగా, ఉల్లాసంగా” శ్రమ యజ్ఞంలో పాల్గొన్నారు. ఇద్దరు మహిళా కార్యకర్తలు మాత్రం ప్రవేశ ద్వారం వద్ద చిందరవందరగా పడి ఉన్న పేవర్ టైల్స్ రాళ్ళ ముక్కలను మాత్రం ఎంతో అమరికగా తాపీ మేస్త్రి వలె చాలా నైపుణ్యంగా పేర్చారు.
సరిగ్గా 6 గంటలకు విజిల్ మ్రోగగానే కార్యకర్తలంతా పనికి విరామమిచ్చి చెమటతో తడిసి ముద్దయిన కార్యకర్తలు చేతులు శుభ్రపరచుకుని ఈ రోజు సమీక్షలో పాల్గొని ‘గడ్డం అనిల్’ మాస్టారు పలికించిన “స్వచ్ఛ చల్లపల్లి” నినాదాలకు బదులిచ్చి,
ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారి నెలవారీ చందా 5,000/- రూపాయలను అందుకుని,
NTR పార్కులోని నడక మిత్రులు ఏర్పాటు చేసిన కాఫీ సేవించి కొద్ది సేపు ‘ఓపెన్ జిమ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రేపటి కార్యక్రమం కోసం పద్మావతి ఆసుపత్రి రోడ్డులోని సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ క్రాస్ రోడ్ వద్ద కలుసుకుందాం.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
07.08.2025.
(కృష్ణశాస్త్రి శైలిలో ఐతే) – 3
స్వచ్ఛ సుందరోద్యమం ఒక అమృతగీతం
(మళ్ళీ నిన్నటి తరువాయి)
ఓ సమయ శ్రమ త్యాగశీలి!
నీకింకా అవసరమా – ఆర్భాటాలూ, అట్టహాసాలూ?
ప్రచార హోరులూ, పొగడ్తలూ- భుజ కీర్తులూ?
ఆగామి- ఆదర్శ సమాజ ఆవిష్కర్తవి!
శ్రమ, నిబద్ధత, అణుకువలతో నీవే సుమా
మా గ్రామ భవిష్య దాశాకిరణానివి!
ప్రశంసల నధిగమించి, కీర్తి కాంక్షల్ని దాటుకొని
స్థిత ప్రజ్ఞుడివౌతున్ననీవే సుమా- మానమ్మకానివి!
ఎడతెగక మా కోసం ‘అమృతం కురిస్తున్న రాత్రివి’!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
07.08.2025