3554* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

08.08.2025 శుక్రవారం 3554* వ రోజు నాటి స్వచ్ఛ సేవల వివరాలు!

          ఈరోజు పద్మావతి ఆసుపత్రి రోడ్డులోని స్పెండర్ సిటీ క్రాస్ రోడ్డు వద్ద 4:13 నిమిషాలకు 10 మంది కార్యకర్తలు ఊరి సేవకోసం సిద్ధమయ్యారు. బాగా పెరిగిన కలుపు గడ్డిని కత్తులతో కోసి శుభ్రం చేశారు. మరికొందరు పెరిగిన చెట్ల కొమ్మలను రోడ్డు మీదకు రాకుండా మిషన్ తో కట్ చేశారు.

          కొందరు అల్స్టోనియా చెట్టు మొదళ్లను పొడవు తగ్గించి వాటి మీదకు తీగజాతి మొక్కలను ఎక్కించారు. కొందరు మాత్రం సన్ ఫ్లవర్ స్పెండర్ సిటీ దారిలో ఒక వైపు గజం వెడల్పులో శుభ్రంగా కలుపును కొట్టి గుట్టలుగా పోగులు పెట్టారు.

          మహిళా కార్యకర్తలంతా వెనుక చీపుళ్ళతో చేసిన భాగం ఊడ్చినారు. ఇప్పటి వరకూ చేసిన ప్రాంతమంతా ఒకసారి వెనుతిరిగి చూస్తే  ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది.

          6 గంటలు దాటిన తరువాత విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప ఈరోజు స్వచ్ఛ  కార్యక్రమానికి విచ్చేసిన డా.శివ ప్రసాదు గారు పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లినినాదానికి జై కొట్టి,

          డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి నెలవారీ చందా 2,000/-, దేసు మాధురి గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇచ్చే సంవత్సర చందా 1,000/- ను రధసారధుల వారు స్వీకరించి,

   

          రేపు కలవవలసిన ప్రదేశం ఈరోజు ఆగిన చోటే అనగా సన్ ఫ్లవర్ స్పెండర్ సిటీ క్రాస్ రోడ్డు వద్ద అనుకుని నిష్క్రమించారు.

          స్వచ్ఛ కార్యకర్త కోడూరు వెంకటేశ్వరరావు గారు నెలవారీ చందా 520/- ను ఈరోజు ఆసుపత్రిలో డాక్టరు గారు స్వీకరించడమైనది.   

- నందేటి శ్రీనివాస్

   ప్రజా కళాకారుడు  

   08.08.2025.

 

          పునరాలోచించలేర?

పదేళ్ల తదుపరి సైతం స్పందించని పౌరులార

మీకై కష్టిస్తున్నా గుర్తించని ధన్యులార

అప్పుడపుడు అవహేళన లందించే మాన్యులార

పునరాలోచించలేర? స్ఫూర్తినసలు పొందలేర?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   08.08.2025