పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
12.08.2025 మంగళవారం 3558* వ రోజు నాటి స్వచ్చోద్యమ విశిష్టత!
తెల్లవారుజాము 4:19 నిమిషాలకి 11 మంది కార్యకర్తలు హైవే రోడ్డులోని కాసానగర్ జంక్షన్ వద్ద మొదటి ఫోటో దిగి పనిని మొదలుపెట్టారు. చేతిలో అవసరమైన పనిముట్లు, తలమీద వెలుగులు చిమ్మే లైటు, చేతికి రక్షణగా గ్లౌజు, కాలికి రక్షణగా బూట్లు ఆ సమయంలో ఆ రహదారిపై వెళ్ళే వాహనాల డ్రైవర్లకు, ప్రయాణించే జనాలకు ఇలాంటి విచిత్రమైన దృశ్యం కనిపించేది మాత్రం ఒక్క చల్లపల్లి పొలిమేరలలోనే.
ఎందుచేతనంటే 11 సంవత్సరాలుగా గ్రామ స్వచ్చతా, శుభ్రతే లక్ష్యంగా మనకోసం మనమే అంటూ ఊరిలో చెప్పనలివి కాని మార్పులు చేయగలిగినా ఇంకా మిగిలి ఉన్న మా లక్ష్యాలు సాధిస్తాం సాధిస్తాం అంటున్నది స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు మాత్రమె గనుక,
2 నెలల క్రితం కాసానగర్ జంక్షన్ లో జాతీయ రహదారి ప్రక్కన శుభ్రం చేస్తూ హైవే వారు కట్టి పట్టించుకోకుండా వదిలేసిన డివైడర్లలో ఇది చల్లపల్లి ప్రవేశ మార్గం ఇలా ఉండకూడదని గ్రామ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే మేడం గారి ఆలోచనలతో ఆ డివైడర్లలో మట్టి నింపి, బాగు చేసి 100 కు పైగా టెంపుల్ ట్రీ, గన్నేరు, టెకోమా రెడ్, టెకోమా ఎల్లో లాంటి పూల మొక్కలను నాటి పరిరక్షిస్తూ ఓ సుందరమైన ప్రదేశాన్ని ఆవిష్కరించిన ఘనత స్వచ్చ కార్యకర్తలది.
ఈరోజు ఆ మొక్కలలో ఉన్న కలుపు మొక్కలను కార్యకర్తల బృందం వేర్లతో సహా లాగి మొక్కలు ఏపుగా పెరగడానికి కృషి సల్పారు. తదుపరి లాగిన చెత్తనంతా అక్కడి నుండి ట్రాక్టర్ కు లోడ్ చేశారు. మరొక బృందం చల్లపల్లి ప్రవేశ స్వాగత ద్వారం వద్ద ఉన్న “స్వచ్చ సుందర చల్లపల్లి” అక్షరఫలకం క్రింది భాగంలో మొక్కల పెంపకానికి అనువుగా గాడి త్రవ్వి ఎర్రమట్టిని నింపి సిద్ధం చేశారు.
ఎంత పని చేసినా తృప్తి చాలక చల్లపల్లిని అపురూప సుందర వనంగా తీర్చిదిద్దాలనే కాంక్షతో అలుపెరగక 6 గంటల వరకూ పనిచేసిన 24 మంది విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో ‘ల్యాబ్ లక్ష్మి’ పలికిన నినాదాలకు బదులిచ్చి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ కాసానగర్ జంక్షన్ లోనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
12.08.2025.
కడుపారగ కన్నతల్లి!
శ్రమదానం అతిసులువుగ సాధ్యపడిన చల్లపల్లి
ఊరంతా కుటుంబముగ ఊహించిన మంచిపల్లి
అనివార్యముగా పదేళ్ళు అలుపెరుగక పాటుబడే
కార్యకర్త లెందరినో కడుపారగ కన్నతల్లి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
12.08.2025.