3559* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

13.08.2025 బుధవారం 3559* వ రోజు నాటి స్వచ్ఛ శ్రామికుల కార్యములు!

           ఈరోజు తెల్లవారుజాము 4:23 నిమిషాలకి 8 మంది కార్యకర్తలు జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద మొదటి ఫోటో దిగారు.

          రాత్రి నుండి విపరీతమయిన వర్షం, గాలులతో అంతా జలమయమయ్యి తెల్లవారుజాము 3 గంటలు దాటే వరకూ వర్షం పడుతూనే ఉంది. అయినా సరే కొంచెం వర్షం ఆగినదే తడవుగా పనిముట్లు చేతబట్టి  కార్యోన్ముఖులయ్యారు. మాలక్ష్యం, మా గమ్యం, మా గమనం ఈ ఊరి స్వచ్ఛ, శుభ్రత, సుందరీకరణ అంటున్నా కార్యకర్తలను ఏమని సంభోధించాలి.

          కాసానగర్ మలుపు నుండి దారి అంచున దట్టంగా పెరిగిన మాచర్ల కంపను వేర్లతో సహా లాగి గుట్టలుగా వెయ్యడం, ఆదారిలోనే ఉన్న గుడి ప్రక్కన రోడ్డు కోతకు గురికాబోతున్న ప్రాంతాన్ని శీలలు పాతి చెక్కలడ్డంపెట్టి సరిచెయ్యడం.

          చెక్ పోస్ట్ మీదకి పడవేసి ఎప్పటినుంచో ఉన్న చెక్కలు, కర్రలు మరియు చెత్తా చెదారాల్లాంటి వ్యర్ధాలను బాగుచేసి ఎంతో పరిశుభ్రంగా ఆ ప్రాంతాన్ని తయారుచేశారు. కొద్ది భాగం పొడవునా రోడ్డు మార్జిన్ లోని సువర్ణ గన్నేరు మొక్కల వరకూ ఉన్న కలుపు గడ్డినీ, మాచర్ల కంపనూ బాగుచెయ్యడంతో ఎంతో శుభ్రంగా ఉంది. వర్షానికి నాని వేర్లతో సహా లాగడానికి అనువుగా ఉండడంతో ఈరోజు కత్తులకు కొంత పని తగ్గిందని చెప్పవచ్చు.

          సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్ అన్న గురజాడ సూక్తి గుర్తుచేసుకుంటే సొంత లాభమున్నా ఇలాంటి ప్రతికూల వాతావరణంలో బయటకురాని పరిస్ధితులలో ఈ జనముంటే, వీళ్ళెంటి? 11 సంవత్సరాలు దగ్గరకొస్తున్నా ఉద్యమం ప్రారంభించి 11 రోజుల ఉత్సాహం వలె పాల్గొన్నారంటే చల్లపల్లిలో జరుగుతున్న స్వచ్ఛ ఉద్యమ నేపధ్యం అలాంటిది.

          ఎందుకంటే ఒక ఊరి ప్రజల ప్రయోజనం కోసం సమయం, శ్రమతో పాటు వారి కష్టార్జితాన్ని కూడా తృణ ప్రాయంగా నెంచి ఉద్యమాన్ని ముందుకు నడుస్తున్న రధసారధులు అంతే అంకితభావం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల సమాహారం ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం.

          6 గంటల వరకూ 16 మంది కార్యకర్తలు శ్రమించిన పిదప విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి మట్టి చేతులు శుభ్రపరుచుకుని కాఫీ సేవించిన పిదప సమీక్షా కార్యక్రమంలో సీనియర్ కార్యకర్త కోడూరు వేంకటేశ్వరరావుగారు చెప్పిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదాలు మార్మోగగా అందరూ వంతు పలికి,

          రేపు కలవవలసిన ప్రదేశం ఈ కాసానగర్ జంక్షన్ వద్దే అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  13.08.2025.

 

         వాళ్ళకు నిద్దుర పట్టదు!

ఊరు సరే- ఊరిచుట్టు తొమ్మిది రహదారులనూ

బాగు చేసి, ఆ ఊళ్లకు పచ్చతోరణాలు కట్టి

అందాలను పెంచనిదే - ఆహ్లాదము పంచనిదే

ఒక పుష్కరకాలంగా వాళ్ళకు నిద్దుర పట్టదు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   13.08.2025.