పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
15.08.2025 శుక్రవారం 3561* వ రోజు నాటి స్వచ్చ శ్రమ – సందర్భాలు!
216 జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద కొద్ది రోజులుగా జరుగుతున్న స్వచ్చ సేవలలో భాగంగా తెల్లవారుజాము 4:21 నిమిషాలకి 9 మంది కార్యకర్తలు పనిముట్లను చేతబట్టి రంగంలోకి దిగారు. పెరిగిన సువర్ణ గన్నేరు మొక్కలతో పాటు అంతే స్థాయిలో ఏపుగా పెరిగిన మాచర్ల కంపను వేర్లతో సహా లాగి గుట్టవేస్తున్నారు. ఆ మాచర్ల కంప గుట్టను కోతకు గురైన హైవే మార్జిన్ గుంటలలో వేసి సరిజేస్తున్నారు.
రోడ్డు మార్జిన్ లో అనగా మొక్కలకు ముందు భాగాన ఒక కార్యకర్త మిషన్ తో మొదలుకంటూ గడ్డిని కత్తిరించడంతో చాలా శుభ్రంగా అందంగా కనపడుతూ పూల మొక్కల సోయగాలు కూడా కంటికి ఇంపుగా దర్శనమిస్తున్నాయి. మిషన్ కటింగ్ కు ముందుగా ఒక బృందం మాచర్ల కంపను లాగుతూ కటింగ్ కు అంతరాయం లేకుండా చేస్తున్నారు.
కార్యకర్తలలోని ఒక దళం 5-6 మంది సభ్యులు 2 రోజుల క్రితం రోడ్డు కోతకు గురికాకుండా చేపట్టిన పరిరక్షణా చర్యలలో భాగంగా బాదులు పాతి వాటికి అడ్డు కర్రలు కట్టి మిగిలి ఉన్న మొద్దులను ఖాళీలలో వేసి ఆ మలుపు మార్జిన్ లో మట్టి జారకుండా పకడ్బందీగా పరిరక్షణా చర్యలు చేపట్టారు.
కొందరు మాత్రం మార్జిన్ ప్రక్కన పల్లాలలో చెత్త తుక్కును వేసి సరిచేస్తున్నారు.
6 గంటలు వరకూ పనిచేసి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లికి” జై కొట్టి,
రేపటి కార్యరంగస్థలం కూడా ఇదే కాసానగర్ జంక్షన్ కి ముందు భాగంలో అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
15.08.2025.
ఇంద్రజాలమిక చూద్దాం!
రిజిస్ట్రారు ఆఫీసూ, తూర్పు రామ మందిరమూ
ఎన్నెన్నో దుకాణాలు, ఊరి పెద్ద మస్జిద్దూ,
కాఫీ-భోజనశాలలు, బ్యాంకులు, గుడులూ, బంకులు-
ఇన్నిటినీ శుభ్ర పరచు ఇంద్రజాలమిక చూద్దాం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
15.08.2025.