పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
17.08.2025 ఆదివారం 3563* వ రోజు నాటి స్వచ్చోద్యమ మరుపురాని సన్నివేశములు!
216 జాతీయ రహదారిపై నేడు 47 మంది (స్వచ్ఛ కార్యకర్తలు + 1974 బ్యాచ్ గుంటూరు మెడికల్ కాలేజి డాక్టర్ల బృందం) కలుసుకుని అపరిశుభ్రతపై పోరాటానికి సిద్ధమయ్యారు.
జాతీయ రహదారికి ఒక అంచున ఉన్న రిటైనింగ్ వాల్ పొడవునా పేవర్స్ రాళ్ళ మధ్యలో మొలిచిన గడ్డి మొక్కలను లాగుతూ రాళ్లపై పేరుకుపోయిన మట్టిని గోకుడు పారలతో శుభ్రం చేసి ఊడవడం ఈ రోజు అందరి పనిగా జరిగింది.
బాగు చేయగా వచ్చిన గడ్డిని, తుక్కునూ, మట్టిని రోడ్డు కోతకు గురి కాకుండా చేస్తున్న పరిరక్షణా చర్యలకు ఉపయోగించారు.
స్వచ్చ సుందర చల్లపల్లి సందర్శనార్థం గత 2 సం.లు క్రమం తప్పక విచ్చేసిన 1974 సం. గుంటూరు మెడికల్ కాలేజి వైద్య విద్యార్థులు ఈ సంవత్సరం మూడవ సారి మన ఊరికి నిన్న రావడం జరిగింది. వారిని మన డాక్టరు గారు, మేడమ్ గారు సాదరంగా ఆహ్వానించడం , నిన్న సాయంత్రం 4 గం.కు చల్లపల్లి ప్రవేశ స్వాగత ద్వారం వద్ద డా.పద్మావతి మేడమ్ గారు నూతనంగా నిర్మించిన మోడరన్ బ్యారికేడ్స్ ను వారి చేత ప్రారంభింపచేయడం, వారు ఆ ప్రదేశాన్ని చూసి మంత్ర ముగ్ధులవడం జరిగింది.
ఆ సందర్భంగా నిన్న సాయంత్రం 5 గం.కు కోసూరివారిపాలెం చిన్నారులతో మురళీ కోలాట ప్రదర్శన ఏర్పాటు చేయడం, వారు కూడా ప్రదర్శనలో స్వయంగా పాల్గొని ఎంతో ఉత్సాహంగా అభినయించడం జరిగింది. కృష్ణాష్టమి అయినందున వచ్చిన అతిథుల కోరిక మేరకు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వారంతా పాల్గొని సాంప్రదాయబద్ధంగా నిర్వహించి చల్లపల్లితో వారి అనుబంధాన్ని మరింత బలపరచుకొన్నారు.
ఈ రోజు ఉదయం 5 గం.లు దాటిన తరువాత వీరంతా కాసానగర్ జంక్షన్ వద్ద జరుగుతున్న స్వచ్చ సేవలో పాల్గొని రోడ్డు మార్జిన్ లో మొక్కలు నాటారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి స్టెతస్కోప్ పట్టిన చేతులతో మట్టిలో దిగి మట్టిని తవ్వి, 3 చింత మొక్కలు, 2 ఏనుగు తొండం మొక్కలు, 16 సువర్ణ గన్నేరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిన బూనారు. గత 2 పర్యాయాలు వచ్చిన సందర్భాలలో వారు హైవే రోడ్ మార్జిన్ లో నాటిన మొక్కల పెరుగుదల చూసుకుని ఎంతో మురిసిపోయారు.
6 గంటల తరువాత విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి, కాఫీ సేవిస్తూ పని పాటల ముచ్చట్లాడుకొని తదుపరి సమీక్షలో పాల్గొన్నారు.
సర్పంచ్ శ్రీమతి కృష్ణకుమారి గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదానికి గొంతు కలిపి జై కొట్టారు. స్వచ్ఛ చల్లపల్లి నేను పాడిన చైతన్య గీతాలకు చప్పట్లు కొట్టి ఆనందాన్ని తెలియచేశారు.
ఆ వైద్య బృందం తరపున డాక్టర్ నాగరాణి గారు మాట్లాడుతూ చప్పట్లు మాత్రమే కొట్టి కార్యాచరణకు దూరంగా ఉండే జనమున్న ఈ రోజుల్లో ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేకున్నా ఊరి కోసం 11 సం.లుగా మీరు చేస్తున్న స్వచ్ఛ సేవ ఎంతో కొనియాడదగినది, వెలకట్టలేనిది అన్నారు. ఈ రోజు నావంతు బాధ్యతగా స్వచ్ఛ చల్లపల్లి అభివృద్ధికి 20, 000/- విరాళం “మనకోసం మనం” ట్రస్టుకు అందించారు.
చల్లపల్లి గౌడపాలెంకు చెందిన మురారి శివ శంకర్ గారి కుమారుడు మురారి సాత్విక్ 10,000/- విరాళాన్ని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి నిమిత్తం “మనకోసం మనం” ట్రస్టుకు అందించారు.
ఆద్యంతం ఉత్సాహ భరితంగా జరిగిన ఈ రోజు స్వచ్ఛ సేవా కార్యక్రమాలు విచ్చేసిన అతిథులలో ఎంతో స్ఫూర్తిని నింపాయి.
రేపు కలవవలసిన ప్రదేశం వక్కలగడ్డ కాలువ వంతెన వద్ద అని అనుకుని కార్యకర్తలంతా తిరుగు పయనమయ్యారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
17.08.2025.
చప్పిడి విషయం కాదట
సచ్ఛరిత్ర ఏదైనా శ్రమతోనే నిర్మితమట
చల్లపల్లి శ్రమదానం చప్పిడి విషయం కాదట
దేశ చరిత్రలో అది ఒక తీపి గుర్తు కానుందట
ఆ చరిత్ర నిర్మాతల కంజలించి తీరాలట!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
17.08.2025.