3565* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

19.08.2025 మంగళవారం 3565* వ రోజు నాటి స్వచ్ఛ యజ్ఞ ఘట్టములు!

          216 జాతీయ రహదారిపై గంగులవారిపాలెం రోడ్డు వద్ద అనగా చల్లపల్లి ప్రవేశ మార్గమైన స్వాగత ద్వారం వద్ద 4:12 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు శ్రమేవ జయతేఅంటూ పని ప్రారంభించారు.

వారు మొదలు పెట్టింది ఏమి పని?

ఊరి పని!

అదీ ఏ సమయంలో?

          తెల్లవారుజాము దీనిలో కొత్తగా మార్పు ఏమీ చెప్పుకోనవసరం లేకపోవచ్చు గాని ఇది 11 సంవత్సరాలుగా అపరిశుభ్రతపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఘన చరిత్ర కలిగిన స్వచ్ఛ చల్లపల్లిఉద్యమం.

          జాతీయ రహదారి ప్రక్కన గత రెండు సంవత్సరాలక్రితం నాటిన పూల మొక్కలు, నీడనిచ్చు మొక్కల ప్రక్కల పిచ్చి మొక్కలు శుభ్రంగా బాగుచెయ్యడం, కలుపు - పిచ్చి మొక్కలు లేకుండా చెయ్యడం, రెండవ ప్రక్క పూల మొక్కల చుట్టూ కలుపు తీయడం, పాదులు చేయడం ఈరోజు వీరి కర్తవ్యం.

          సమయం గడిచిన కొద్దీ ఒక్కొక్కరూ వచ్చి చేరగా మొత్తం 27 మంది కార్యకర్తలు నిర్విరామంగా శ్రమించారు. బాగు చేయగా వచ్చిన తుక్కును ట్రాక్టర్ లో లోడింగ్ చేశారు.

          6 గంటల వరకూ పనిచేసిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప జరిగిన సమీక్షలో హేమంత్చెప్పిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లినినాదానికి జై కొట్టి,

          రేపు మనం కలువవలసిన ప్రదేశం ఇక్కడే  స్వాగత ద్వారంవద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  19.08.2025.

 

(216) వ రోడ్డుకింత మహర్దశా!

రెండొందల పదహార (216) వ రోడ్డుకింత మహర్దశా!

2 ½ కి.మీటర్ల దట్టమైన హరితవనం

వైద్య బృందములు నాటిన వివిధ జాతి పూలవనం

ఎన్ని వేల గంటల శ్రమ ఈ అందాలకు మూలం?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   19.08.2025.