3568* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

22.08.2025 శుక్రవారం - 3568* వ రోజు నాటి స్వచ్చ సేవా ఘట్టములు!

          జాతీయ రహదారిపై స్వచ్చ చల్లపల్లి ప్రవేశ స్వాగత ద్వారానికి అతి సమీపంలో ఈ రోజు పని చేయుటకు వేకువ జాము 4.13 ని.లకు 9 మంది చేరుకొని మొదటిసారి ఫోటో దిగి ప్రప్రధమ ఘట్టాన్ని పూర్తి చేసి ఆ తదుపరి పమిముట్లు చేతబట్టి చెత్తపై యుద్ధానికి  సమాయత్తమయ్యారు.

          హైవే రహదారికి కుడి ఎడమల కార్యకర్తలు2 సంవత్సరాల నాడు నాటిన మొక్కలలోని కలుపు, వాటి పెరుగుదలకు ఆటంకమైన పిచ్చి తీగ లేకుండా చెయ్యడం ఆ ప్రాంతాన్ని కూడ అందంగా చూపడం కార్యకర్తల అభిలాష. ఆ లక్ష్యంతోనే నెలల తరబడి హైవే రోడ్ లో పని చేస్తూ నాటిన మొక్కలను ఎండా, వానా, గాలి, గేదెలు, మేకల బారిన పడకుండా పసి బిడ్డల వలె తమ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఈ స్వచ్చ కార్యకర్తలు నిజమైన ప్రకృతి ప్రేమికులు.

          చల్లపల్లి లో ఒకప్పటి సామూహిక బహిర్భూమి ప్రాంతాలను సైతం పూల పరిమళాలు వెదజల్లే ఉద్యానవనాలుగా మార్చి, దుర్గంధంతో నిలబడలేని ప్రదేశాలను నేడు కూర్చొని సేదతీరి ఆహ్లాదాన్ని అందుకునే ఆనంద నిలయాలుగా మార్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఈ స్వచ్చ చల్లపల్లి ఉద్యమానిది.

          దారి పొడవునా రోడ్డు మార్జిన్ లోని పెరిగిన గడ్డిని మిషన్ చేతబట్టి ఒక కార్యకర్త కట్ చేస్తుంటే ఆ దారి ప్రక్క అందం చూడముచ్చట గ ఉంటుంది. వేరొక ప్రక్క మొక్కలలో పాదుల చుట్టూ బాగు చెయ్యడం, ఒక ప్రత్యేక దళం స్వాగత ద్వారం వద్ద అంచును పటిష్ట పరుస్తూ ఉండటం ఇవన్నీ స్వచ్చ కార్యకర్తల పనితనానికి స్వచ్చ సేవ పట్ల వారి అంకిత భావానికి మైలు రాళ్లు.

          6 గంటలు దాటి కొంత సమయమైనాపని విరమించక, చేతిలో పని పూర్తి చేసి విజిల్ మ్రోగగానే 28 మంది కార్యకర్తలు పని ముగించి, కాఫీ సేవించిన పిదప తూము వెంకటేశ్వర రావు గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి జై కొట్టి, అడపా గురవయ్య మాష్టారు చెప్పిన నీతి సూక్తులు ఆలకించి డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు అందించిన మిఠాయిలను తీసుకున్నారు. రేపు కలవవలసిన ప్రాంతం ఈ హైవే లోని ఈ రోజు పని ముగిసిన ప్రదేశం వద్ద అనుకుని నిష్క్రమించారు.         

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  22.08.2025.

చల్లపల్లిలో స-రి-గ-మ-ప-ద-ని-స’ – 1

ప్రభావశీలము కార్యాచరణని పదేపదే డి.ఆర్.కె.చెప్పగా

'సలహాలిస్తే చేసి చూపుమ'ని సజ్జా ప్రసాదు నొక్కి చెప్పగా

కార్యకర్తలా ఇద్దరి షరతులు క్రమశిక్షణతో ఆచరించగా

స్వచ్ఛ సంస్కృతీ స-రి-గ-మ-ప-ద-ని-స చల్లపల్లిలో వినిపించెనుగా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   22.08.2025.