3569* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

23.08.2025 శనివారం - 3569* వ రోజు నాటి స్వచ్చ సేవా శ్రమదాన ఘట్టములు!

          ఈ రోజు తెల్లవారు జాము 4.21 ని.లకు 18 మందికార్యకర్తలు పెద్ద స్వచ్చ దండులాగా జాతీయ రహదారి పైకి పనిలో పాల్గొనటానికి వచ్చారు. హైవే లోని శారదా గ్రాండ్యూర్ (ఫంక్షన్ హాల్) కు అతి సమీపంలో అందరూ కలుసుకొని పనిముట్లు పట్టుకొని పనికి ఉపక్రమించారు.

          మనం గతంలో నాటిన వివిధ రకాలయిన పూలు, నీడనిచ్చు మొక్కలను సంరంక్షించే పనిలో భాగంగా నిన్నటి పనికి కొనసాగింపుగా మొక్కలను చుట్టుముట్టిన రెల్లు గడ్డి దుబ్బులను కోసి వాటి మధ్య నలిగిపోతున్న మంచి మొక్కలను బయటకు తీశారు. హైవేకు ఎడమ ప్రక్క (అవనిగడ్డ వైపు) మరియు కుడి ప్రక్క ఒకే రీతిలో మొక్కల చుట్టూ బాగు చేసి వాటిని పరిరక్షిస్తున్నారు.

          గడ్డి కటింగ్ మిషన్ తో రహదారి అంచున అత్యంత చూడదగిన రీతిలో కట్ చేస్తూ కొంత మానవ శ్రమను తగ్గిస్తున్నారు. అన్ని మొక్కలూ గత 2 నెలల క్రితం చూసి ఇపుడు చూసుకుంటుంటే మొక్కలు అటు, ఇటు బాగా పెరిగి పూల గుత్తులతో భలే అందంగా కనిపిస్తున్నాయి.

          మరొక బృందం చల్లపల్లి ప్రవేశ స్వాగత ద్వారం వద్ద నిన్న చేయగా మిగిలిన మట్టి పనిని పూర్తి చేశారు. అక్కడ గ్రీనరీ కోసం లాన్ వేయవలసి ఉన్నది.

          6 గంటలు దాటినా పని ముగించి రాని38 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామం అంటూ కాఫీ సేవించి తదుపరి సమీక్షలో తూములూరి లక్ష్మణ రావు గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి జై కొట్టి,

          రేపు కలవవలసిన ప్రదేశం హైవే లోని శారదా గ్రాండ్యూర్ వద్ద అనుకుని నిష్క్రమించారు.    

 

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  23.08.2025.

 

చల్లపల్లిలో స-రి-గ-మ-ప-ద-ని-స’ – 2

బృందావనుడి సృజనశీలతలు పెక్కుమంది కాశ్చర్యము నింపగ

వేలుపూరి కంప్యూటరు నిపుణత వెన్నుదన్నుగా నిలుస్తుండగా

గోలుకొండ డేవిడ్ చతురతలొక క్రొత్త చమక్కులు తెచ్చుచుండగా

చల్లపల్లి స్వచ్ఛంద సేవలో స-రి-గ-మ-ప-ద-ని స వినవచ్చెనుగా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   23.08.2025.