2004*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 2004* వ నాటి కర్తవ్య దీక్షలు 

            కొద్దిపాటి మార్పులతో 29 మంది కార్యకర్తలు గ్రామం లోని మూడు చోట్ల – మూడు విధాల ప్రయోజనకరమైన శ్రమదానం చేశారు. 4.05 – 6.05 సమయాల మధ్య ఈ బాధ్యతా నిర్వహణం జరిగింది. ఎన్ని వేల దినాల, ఎన్ని లక్షల పని గంటల పాటైనా – స్వచ్చ సైనికుల స్వగ్రామ మెరుగుదల దీక్ష మాత్రం మారలేదు – చల్లపల్లి కి అందవిహీనత బెడద, కాలుష్యం వ్యధ తీరేదాక ఈ కార్యకర్తల బాధ తీరేది కాదు!

            గంగులవారిపాలెం దారి మలుపు దగ్గరి ప్రైవేటు నివేశన స్థలాలను 20 మంది – 40 పని గంటలపాటు శ్రమించి. దర్శనీయాలుగా మార్చడమే ఈ రోజు ముందుగా ప్రస్తావించుకోవాలి. ఎగుడు – దిగుడు దిబ్బల మీద పొదలుగా అల్లుకొన్న తీగలతో, ఉత్తరేణి కంపతో సీమ చింత చెట్లతో, చిక్కులు పడి పెరిగిన ఇంగ్లీష్ తుమ్మ చెట్లతో, పిచ్చి మేడి మొక్కలతో చిట్టడవిగా మారిన ఆ ప్రాంతాన్ని – చీకట్లోనే నరికి, ఊడ్చి రెండు పెద్ద గుట్టలుగా పేర్చారు. ఇందుకు కత్తులు, గొడ్డళ్ళు, మర రంపాలు కావలసి వచ్చాయి.

            - కాస్త వెనకా ముందుగా వీళ్లతో కలిసిన గ్రామ భద్రతా దళం అంతకు ముందు 6 వ నంబరు పంట కాలువ వంతెన దగ్గరి అందమైన చుట్టుగుడిసె మీద బాగా పెరిగి, కరెంటు తీగల దాక ఊగి తగులుతున్న చెట్ల కొమ్మలను ఇంకా అందంగా కత్తిరించి, చుట్టు గుడిసెకు విద్యుద్ఘాతం ముప్పు తప్పించి వచ్చారు. నిన్నటి వ్యర్ధాల గుట్టల్ని ట్రాక్టర్ లో కెత్తి, చెత్త కేంద్రానికి చేర్చారు.

            - అమరావతి జమీతాలూకు వైజయంతం నయన మనోహరమైన రంగులతో, పూల తీగల, పూర్ణ కలశాల, ఇంకా ఇతర కుఢ్య చిత్రాలతో ప్రయాణికులను మోహమాట పెట్టి, చూపులు మరల్చి, నినాదాలను చదివించి – సుందరీకర్తల ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరినట్లయింది. ఈ నగిషీలు, రాచరిక చిహ్నాలైన అలంకరణలు ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుతాయో మరి!

నేడు రోడ్లు ఊడ్చిన – పూల మొక్కల పాదుల్ని చక్కదిద్దిన – గ్రామ వీధుల వెంట వందలాది మొక్కలకు నీరందించిన కార్యకర్తలందరికీ చల్లపల్లి మరికొంత ఋణ గ్రస్తమైపోయింది.

            కోడూరు వేంకటేశ్వరరావు గారి నెలవారీ చందా – 520 ని మనకోసం మనం ట్రస్టు ధన్యవాదపూర్వకంగా స్వీకరించింది.

            రేపటి మన కర్తవ్య పరాయణత కోసం ఈ నాటి కృషి ప్రాంతాలలోనే కలుద్దాం!

             స్వచ్చోద్యమ విధాతలు

చదువు – సంధ్యలు ఉన్నవారలు – స్వార్ధమించుకలేని ధీరులు

వివిధ నేపధ్యాల మహిళలు – ఇంత చిన్నలు – అంత పెద్దలు

రెండు వేల దినాల నుండి ప్రచండ స్వచ్చోద్యమ విధాతలు

అందరికి శిరసాభివందన – లందరికి సుమ చందనాదులు!

 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

గురువారం 07/05/2020,
చల్లపల్లి

విరిగిపోయిన ఈ భాగాన్ని దుర్గా ప్రసాదు గారు ధర్మోకోల్ తో అదే కొలతతో తయారు చేసి బిగించారు. వారికి అభినందనలు.
కార్యకర్తలు శుభ్రం చేసిన తరువాత రోడ్డు.