ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
25.08.2025 సోమవారం - 3571* వ రోజు నాటి శ్రమైక జీవన సౌందర్యం!
జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న శారదా గ్రాండియర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:20 నిమిషాలకు 10 మంది కార్యకర్తలు చెత్తతో యుద్దానికి సన్నద్దమయ్యారు. చల్లపల్లి ప్రారంభం నుండి చల్లపల్లి చివర వరకు హైవే రోడ్ ను పచ్చని, చల్లని, ఆహ్లాదానిచ్చే అందాల రహదారిగా మార్చడానికి ఈరోజు ఒక్కొక్కరూ వచ్చి చేరిన 22 మంది కార్యకర్తలు చేస్తున్న పని ఈ పూల మొక్కలను , పండ్ల మొక్కలను, నీడనిచ్చు మొక్కలను సంరక్షించడమే!
రహదారి మార్జిన్ లో గడ్డిని మిషన్ తో కట్ చేసి చూడముచ్చటగా తయారుచెయ్యడం, మొక్కలలో ఉన్న కలుపును గడ్డిని, పిచ్చి తీగను తీసి మొక్కలను తిన్నగా నిలబెట్టి కట్టడం మరొక బృందం పాదులు చేయడం తద్వారా మొక్కలు ఏపుగా పెరిగి పూల దారిగా మారడం..
మరొక బృందం కాసానగర్ జంక్షన్ వద్ద కోతకు గురి అవుతున్న మెయిన్ రోడ్ అంచును పరిరక్షించే పనిలో ఈరోజు పై భాగంలో మట్టి నింపడం చేశారు. హైవే రోడ్ ప్రక్కన మొక్కలలో పని చేసినంత సేపూ షుమారు 2 గంటల సమయం పాటు ఏటవాలుగా ఉన్న ఆ ప్రదేశంలో ఒక కాలుపై మాత్రమే బలం మోపి నిలబడి పని చెయ్యడం ఏమాత్రం సులువైన పని కాదు. కానీ ఇక్కడ కార్యకర్తకు కావలసినది చల్లపల్లి స్వచ్చత మాత్రమే..
6 గంటలు దాటినా కొంత సమయం తరువాత విజిల్ మ్రోగగానే 22 మంది కార్యకర్తలు పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప ‘మాలెంపాటి అంజయ్య’ గారు పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లి” నినాదానికి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రాంతము ‘శారదా గ్రాండియర్’ వద్దనే అనుకుని నిష్క్రమించారు.
చల్లపల్లి వాస్తవ్యులు పరుచూరి బాబూరావు, బేబీ సరోజిని గార్ల దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం 500/- రూపాయలను విరాళంగా ఇచ్చారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
25.08.2025.
చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 4
అన్నపూర్ణ - పలనాటి భాస్కరులు అవశ్యకముగా సేవలకొస్తే
భోగాదులు దృఢ నిశ్చయమ్ముతో పూని సేవలకు తెగబడుతుంటే
రామానగరం రాజు గారి కృషి రాజసమ్ముగా జరుగుతుండగా
చల్లపల్లి, స్వచ్ఛంద సేవలో స-రి-గ-మ-ప-ద-ను లు వినిపించెనుగా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
25.08.2025.