3574* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

28.08.2025 గురువారం 3574* వ రోజు నాటి స్వచ్చ శ్రమదాన సంగతులు!

          జాతీయ రహదారిపై ఉన్న గంగులవారిపాలెం రోడ్ మొదట్లోని చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:23 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు ప్రప్రధమ ఘట్టమైన మొదటి ఫోటో దిగి కార్యాచరణలో దిగారు.

          స్వాగత ద్వారానికి కుడి ఎడమల ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ ప్రక్కన కొద్ది దూరం కాలికి మట్టి అంటకుండా G.S.B. పోయడానికి కొద్ది మీటర్ల మట్టిని తీసి సరిచెయ్యడం. రెండు ప్రక్కలా నీరు నిలవకుండా వెళ్ళే మార్గం సుగమం చేయడం కొందరి పనిగా సాగింది.

          మరికొందరు కార్యకర్తలు రోడ్డు దిగువ భాగాన హైవే పై ఉన్న వంతెన వరకూ కలుపు గడ్డి, పిచ్చి మొక్కలు లాగి శుభ్రం చెయ్యడం, మొక్కలను అల్లుకొన్న పిచ్చి తీగను లాగి అడవి తంగేడు మొక్కలకు ఊపిరి పోసినారు బండ్రేవు కోడు వంతెన వరకూ గడ్డిని మిషన్ తో కట్ చేయడం వలన మనం నాటిన గద్దగోరు మొక్కలు మాత్రం కొత్త చిగుర్లు తొడిగి వరుస క్రమంలో చూపరులను ఆకర్షిస్తూ ఉన్నాయి

          స్వచ్చ చల్లపల్లి సాధనలో ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపే మున్నది అన్నట్లు వర్షం ఆగి వాతావరణం మబ్బులు కమ్మి చల్లగా ఉండడం క్రమక్రమంగా వచ్చి చేరిన 24 మంది కూడ ఉత్సాహంగా పని చేసి ఆ ప్రాంగణమంతా తీర్చిదిద్దుతుంటే స్వాగత ద్వారం చూసే వారికి అదొక రాజప్రసాదం లాగ రోజుకొక్క కొత్త రూపు సంతరించుకొంటుంది.

          6 గంటలు దాటి కొంత సమయం తదుపరి విజిల్ మ్రోగగానే కార్యకర్తలంతా చేతులు శుభ్రపరుచుకుని కాఫీ సేవించి తదుపరి సమీక్షలో ప్రేమనందం గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లినినాదానికి జై కొట్టారు.

          డాక్టరు గారు మాట్లాడుతూ ఆదివారం జరిగే డా. సోమరాజు గారి గుండె వ్యాధుల అవగాహన కార్యక్రమంలో మనమంతా పాల్గొందాం మరికొంతమందికి తెలియజేద్దామని చెప్పి,

          రేపు మనం బండ్రేవు కోడు వంతెన (హైవే పై) వద్ద కలుద్దామని అనుకొని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  28.08.2025.

 

చల్లపల్లిలో స-రి-గ-మ-ప-ద-ని-స’ – 8

డెబ్బై ఎనిమిది - ఎనభై ఆరుల (78&86) శంకరులూ, గోపాలకృష్ణులూ.

లక్ష్మణులింకా యువతీయువక విలక్షణసేవలు తోడునీడగా

మాధురి-జాహ్నవి-లక్ష్మి ముత్యాల వేకువ సేవల విన్యాసముతో

స్వచ్ఛ - సుందరోద్యమ సంగీతము శ్రవణా నందము చేయుచుండెగా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   28.08.2025.