ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
30.08.2025 శనివారం – 3576* వ రోజు నాటి స్వచ్ఛ సేవల కార్యక్రమాలు!
జాతీయ రహదారిపై బండ్రేవు కోడు వంతెన దగ్గర తెల్లవారుజాము 4.13 ని.లకు 14 మంది కార్యకర్తలు పనిముట్లు చేతబట్టి కార్యరంగంలోకి దిగారు.
మొక్కల చుట్టూ ఉన్న కలుపును, గడ్డిని తీసివేసి పాదులు సరి చెయ్యడం రహదారి క్రింది భాగంలో ఇబ్బడిముబ్బడిగా ఉన్న జిల్లేడు చెట్లను మొదళ్లతో సహా తీసివేయడం జరిగింది.
కొంతమంది కార్యకర్తల బృందం పెద్ద మొక్కలు వంగకుండా, విరగకుండా, వేర్లు బయటపడిపోకుండా బలంగా ఉండటానికి మొక్క చుట్టూ మట్టిని వేసి, కర్ర కట్టి పటిష్టం చేస్తున్నారు.
మహిళా కార్యకర్తలు రోడ్డు మార్జిన్ లో ఉన్న పిచ్చి మొక్కలు లాగుతూ రోడ్డంతా చీపుళ్లతో శుభ్రం చెయ్యడం చేస్తున్నారు.
“నాటేది ఒక్క మొక్క – వేసేను నూరు కొమ్మ” అన్నట్లుగా కార్యకర్తలు నాటిన ఈ మొక్కలు కొంత కాలానికి పెద్ద పెద్ద చెట్లై అనేక మందికి చల్లని గాలినీ, పూల అందాలను, నీడను, పండ్లనూ ఆహ్లాదాన్నీ పంచుతాయనడంలో సందేహం లేదు.
రహదారి మార్జిన్ చూస్తే కటింగ్ మిషన్ తో కట్ చేసినందు వల్ల ఎంతో అందంగా చూడచక్కగా ఉంది. హైవే నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టు సంస్థ వారు హైవే నిర్వహణ విషయంలో ఎలా ఉన్నా చల్లపల్లి పొలిమేరలు, అనగా క్లబ్ రోడ్ నుండి కాసానగర్ జంక్షన్ వరకు మొక్కల పరిరక్షణ పచ్చదనం, పరిశుభ్రత హైవే రోడ్ అందచందాలు అన్నీ స్వచ్ఛ కార్యకర్తలే నిర్వహిస్తుండటం ఓ చారిత్రక ఘట్టం.
6 గం.ల వరకు శ్రమించి, విజిల్ మ్రోగగానే 27 మంది కార్యకర్తలు “ముచ్చు రోహిణి” పలికిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కి జై కొట్టి,
నా ప్రకృతి గీతం ఆలకించి,
గురవయ్య మాస్టారి నీతి సూక్తి విని,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ వంతెన వద్దనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
30.08.2025.
చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 10
అగ్గిరాముళ్లు, ప్రకాశరావులు, పసుపులేటులూ, గోళ్ల కృష్ణలూ,
అడపా, బాణావతులు, అంబటీ, కోడూరీ, నందేటి, మెండులూ,
శరత్ లు, భరత్ లు, శ్రీనులు, గౌతమ, జాస్తీ, వేముల, అంజయ్యాదుల
స్వచ్చోద్యమ సంగీత మూర్ఛనలు చాల గొప్పగా వినిపిస్తుందురు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
30.08.2025.