3577* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

31.08.2025 ఆదివారం 3577* వ రోజు స్వచ్ఛ శ్రమ యజ్ఞం!

          216 జాతీయ రహదారిపై బండ్రేవు కోడు వంతెన వద్ద 4.12 ని.లకు 15 మంది కార్యకర్తలతో ఈరోజు ఆదివారం కార్యాచరణ మొదలైంది.

          వంతెన వద్ద నుండి క్లబ్ రోడ్ వరకు ఉన్న మొక్కలను పరిరక్షించే పనిలో అందరూ నిమగ్నమయ్యారు. మొక్కలను పసిబిడ్డ లాగ చూసుకుంటారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఈ పరిరక్షణా కార్యక్రమం. మొదళ్లను బలం చేసి కర్ర కట్టి రక్షణగా కంప కట్టి నీటి తడికి పాదు చెయ్యడం ఎంత ప్రణాళికాబద్దమైన పని? ప్రభుత్వం వారు చేపట్టే మొక్కలు నాటే కార్యక్రమంలో పై వాటిలో సగం జాగ్రత్తలు తీసుకున్నా ఈపాటికి లక్షలాది మొక్కలు బ్రతికి నీడనిచ్చేవి, ఆహ్లాదనిచ్చేవి, పచ్చదనాన్నిచ్చేవి.

          గడ్డికోత యంత్రానికి చేతి నిండా పని దానితో కట్ చేయడం వలన, పని, అందం, సమయం అన్నీ కలిసొస్తున్నాయి. కొంతమంది హైవే వంతెన అంచుల ప్రక్క ఉన్న చెత్తాచెదారాలు కల్మషాలు ఎత్తివేసి అందమైన ప్రదేశంగా మార్చడం.

          మహిళా కార్యకర్తలు మాత్రం మగవారు కత్తితో పనిచేయగా వచ్చిన కలుపు గడ్డిని గొర్రులతో లాగి పోగు పెట్టడం, పరిశుభ్రంగా ఊడ్చడం వారి నైపుణ్యానికి నిదర్శనం.

          మొత్తం 43 మంది కార్యకర్తలు 6:15 వరకూ పనిచేసి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించే ముందు ప్రాతూరి శాస్త్రి గారు స్వచ్ఛ చల్లపల్లికి వచ్చి దశాబ్ది నిండిన సందర్భంగా పంచిన స్వీటు, హాటు ను తీసుకుని తదుపరి కాఫీ సేవించి సమీక్షలో శాస్త్రి గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి కి జై కొట్టినారు.

          శాస్త్రి మాస్టారు స్వచ్ఛ చల్లపల్లి అబివృద్ధి నిమిత్తం మనకోసం మనం ట్రస్టుకు10,000/- రూపాయల చెక్కును డాక్టర్ గారికి అందించి,

          నేను పాడిన ప్యారడీ, గురవయ్య గారి  నీతి సూక్తులుతో ముగింపు పలికి,

          రేపు మనం కలవవలసిన ప్రదేశం ఈ వంతెన పైనే అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  31.08.2025.

 

చల్లపల్లిలో స-రి-గ-మ-ప-ద-ని-స’ – 11

ఇంకా ఎందరొ ధన్యజీవనులు సాధనాల, తుమ్మల, రావూరులు,

శివబాబింకా యోగా మాస్టరు, పాత్రికేయులూ, ప్రాజ్ఞులు, విజ్ఞులు

తలా ఒక చెయ్యి వేసినందునే ఇలా అద్భుతము జరిగి జరిగి మన

స్వచ్ఛ - సుందరోద్యమ సంగీతము చాల బాగ వినిపించెనిప్పటికె!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   31.08.2025.