ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
02.09.2025 మంగళవారం – 3579* వ రోజు స్వచ్ఛ చల్లపల్లి శ్రమదాన సంగతులు!
216 జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం శారదా గ్రాండియర్ (ఫంక్షన్ హాల్) వద్ద 10 మంది కార్యకర్తలు ఆగి మొదటి ఫోటో ఘట్టాన్ని పూర్తి చేసి తదుపరి పనిముట్లు చేతబట్టి కార్యాచరణకు సిద్ధమయ్యారు.
పెట్టిన మొక్కలకు రక్షణ చర్యలు చేపట్టినా ఒక సంవత్సరం నుండి ఆ మొక్కల మధ్య కలుపు గడ్డి పిచ్చి కాడ పెరిగి దట్టంగా ఉన్న చెత్తను తొలగించే పనిలో కత్తులతో నలుగురు కార్యకర్తలు ప్రక్షాళనకు దిగారు. కోసిన గడ్డిని అక్కడే ఉన్న సైఫన్ గోడ ప్రక్క మట్టి కొట్టుకుపోకుండా రక్షణగా వేశారు. మగవాళ్ళు కోసిన గడ్డి, చెత్తను మహిళలు ఎప్పటికప్పుడు తీసివేస్తున్నారు.
మరొక ముగ్గురు కార్యకర్తలు (సుందరీకరణ బృందం) కటింగ్ మిషన్ దగ్గర పని చేస్తూ మార్జిన్ లో కట్ చేసిన గడ్డి వ్యర్ధాలను రోడ్డు మీద లేకుండా శుభ్రం చేస్తున్నారు.
మరొక బృందం స్వాగత ద్వారం వద్ద వంగిన బోగన్ విలియా పూల మొక్కలు నేల మీద పడిపోకుండా క్రమ పద్ధతిలో పెండె కట్టు కట్టి సరిచేశారు.
6 గంటల వరకు శ్రమించిన 26 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగే సరికి పనికి విరామమిచ్చి ‘వేముల శ్రీను’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ నేషనల్ హైవే లోని ‘శారదా గ్రాండియర్’ వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
02.09.2025.
చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 12
తూములు - రమణులు – గోళ్ల రత్నములు, రోహిణి – సుమతి – బత్తుల – గంగలు
ఉస్మాన్ – ఇందిర – జ్యోతీ – ల్యాబ్ రవి, హరి – హేమంతుడు – సౌభాగ్యవతీ
దాసరి లక్ష్మీ – నాయుడు మోహన – నిరంజనాదుల – రామ కుమారుల
చెమటల వలననె చల్లపల్లి లో స-రి-గ-మ-ప-ద-ని-స ప్రవహిస్తున్నది.
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
02.09.2025.