3582* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

05.09.2025 శుక్రవారం 3582* వ రోజు నాటి స్వచ్చోద్యమ నేపధ్యం!

           హైవేలో రెండు ప్రక్కలా సంవత్సరం క్రితం నాటి పెంచుతున్న మొక్కల పరిరక్షణలో భాగంగా స్వచ్ఛ శ్రామికులు ఈరోజు తెల్లవారుజాము 4:14 నిమిషాలకు హైవే లోని శారదా గ్రాండియర్ వద్దకు 10 మంది చేరుకుని పనికి సంససిద్ధులైనారు.

          హైవే లోని ఫంక్షన్ హాల్ వైపు 2 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలైన తురాయి, బాదం, వేప లాంటి మొక్కలు, గన్నేరు పూల మొక్కలలో కలుపు, గడ్డి ఎత్తుగా పెరిగిన పిచ్చి మొక్కల చుట్టుముట్టుగా వాటిని కత్తులతో తొలగించి మొక్కలకు గాలి, వెలుతురు ప్రసాదించారు.

          డాక్టర్ గారు అంటూ ఉంటారు అప్పుడప్పుడూ ఎవరు చేస్తారీపనులుఅంటూ, నిజంగానే రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు, డాక్టర్లు, ఆసుపత్రి ఉద్యోగులు, సొంత వ్యవసాయ భూములు కలిగిన రైతులు, ఇప్పటి టీచర్లు, నర్సులు, పోస్టల్, రెవెన్యూ, వైద్య, ఇలా వేరు వేరు శాఖలలో ఏసి గదుల్లో, వారివారి కుర్చీలలో ఫ్యాన్లు కింది పని చేసే ఎంతో మంది ఊరి కోసం నిద్రమాని కటిక చీకట్లో హెడ్ లైట్ వెలుతురులో పురుగూ పుట్రా లెక్క చేయకుండా ఊరందరి సౌఖ్యం కోసం చేస్తున్న ఈ “గొడ్డు చాకిరి” కి ఎలా విలువ కట్టగలం.

          టన్నుల కొద్దీ చెత్త వ్యర్ధాలను తొలగించి ట్రాక్టర్ లోకి లోడింగ్ చేసి మట్టి కొట్టుకుపోయే పల్లపు ప్రాంతాలలో సర్దడం, దారికి అటూ ఇటూ మార్జిన్ లో గడ్డిని మిషన్ తో కట్ చెయ్యడం రోజు వారీ శారీరక కష్టం చేసే వారు కూడా ఇంత నాణ్యతగా, నైపుణ్యంగా, పరిశుభ్రంగా, అందంగా చేయలేరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే వీళ్ళు 11 సంవత్సరాలుగా వారి సమయాన్ని శ్రమను త్యాగం చేస్తున్న నిస్వార్ధ జీవులు.

          6 గంటల వరకు చెమటోడ్చిన 28 మంది స్వచ్ఛ శ్రమ జీవులు విజిల్ మ్రోగగానే కాఫీ విరామంలో కాఫీ సేవించి,

          తదుపరి సమీక్షలో సజ్జా ప్రసాదు గారు చెప్పిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టారు.

          ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చల్లపల్లి స్వచ్ఛ శుభ్రతల కోసం అహర్నిశలూ శ్రమిస్తూ చేతిలో కలానికి బదులు కత్తి గొర్రూ పలుగూ పార చేతబట్టి ఊరికొరకు చెమటను చిందిస్తున్న మా ఉపాధ్యాయ స్వచ్ఛ కార్యకర్తలు

ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి,

నల్లూరి రామారావు,

వేముల శ్రీనివాసరావు,

తగిరిశ సాంబశివరావు,

అడపా గురవయ్య,

నారంశెట్టి వేంకటేశ్వరరావు(యోగా మాస్టారు),

భోగాది వాసుదేవరావు,

లంకె సుభాషిణి,

రాయపాటి విజయరమ,

కోట పద్మావతి,

పైడిపాముల కృష్ణకుమారి,

KBN శర్మ,

రావూరి సూర్య ప్రకాశరావు,

వేమూరి అర్జునరావు,

అనుమకొండ దుర్గా ప్రసాదు,

పాగోలు దుర్గా ప్రసాదు,

గణపరెడ్డి భగవాన్ గార్లకి

          స్వచ్ఛ చల్లపల్లి పెద్దలు దాసరి రామమోహనరావు గారు

          అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి,

          రేపు మనం కలువవలసిన ప్రదేశం ఇక్కడే అనగా “శారదా గ్రాండియర్” వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  05.09.2025.

 

 ప్రశ్నల పరంపర – 1

అడిగి చూశా చల్లపల్లిని – “అంతగా నీ అందమేమని,

ఎందుకింతటి పచ్చదనమని, నీ శ్మశానం సొగసులేమని,

ఎలాగా నీ వీధులన్నీ ఇంత శుభ్రత నిండి నాయని....

అన్నిటికి ఒకె సమాధానం – “స్వచ్ఛ సుందర ఉద్యమం” అని!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   05.09.2025.