ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
06.09.2025 శుక్రవారం - 3583* వ రోజు నాటి స్వచ్చ సేవల వివరములు!
జాతీయ రహదారిపై ఉన్న శారదా గ్రాండియర్ వద్ద ఈ రోజు తెల్లవారు జామున 4.14 ని.లకు 12 మంది కార్యకర్తలు ప్రధమ ఘట్టమైన మొదటి ఫోటోను పూర్తి చేసుకుని కార్యోన్ముఖులయ్యారు.
చేయవలసిన పని మాత్రం షరా మామూలే. చిట్టడవి లాంటి గడ్డి, కలుపు, దొండ తీగ లాంటి వాటి మధ్యలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న మొక్కలను రక్షణ కల్పించి బ్రతికించడం, ఎక్కువ మంది పని కత్తులతోనే.
పదేళ్ల పైబడి పని చేస్తున్న కార్యకర్తలకు పెద్ద పరీక్ష లాంటిదీ పని.ఎందుకంటే బోరు బావిలో పడిన పిల్లాడిని సురక్షితంగా బయటకు తీసినట్లుగా చుట్టూ ముళ్ళ పొదలు, అల్లుకున్న దట్టమైన తీగ, కమ్మేసిన కలుపు గడ్డిలోంచి మనం నాటి బ్రతికించిన మొక్కను జాగ్రత్తగా కత్తి గాటు తగలకుండా బయటకు తీసి రక్షించడం.
కొంతమంది మహిళా కార్యకర్తలు టన్నుల కొద్ది చెత్తను పైకి లాగి ట్రాక్టర్ లో లోడింగు కు గుట్టలు సిద్ధం చేయడం. కొద్దిమంది రెండవ వైపు రహదారి ప్రక్క పాదులలో కలుపు తీసి శుభ్రం చేయడం.
ఒక కార్యకర్త మాత్రం గడ్డి కట్టర్ ను ఉపయోగించి రెండు ప్రక్కలా హైవే మార్జిన్ లు మిషన్ తో కత్తిరిస్తూ హైవేకు చూడ చక్కటి రూపమిస్తున్నారు.
6 గం.ల వరకూ చెమటోడ్చిన 38 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ ముచ్చట్ల తదుపరి సమీక్షలో నందేటి శ్రీనివాస్ పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి కి జేజేలు పలికి, గేయాన్ని ఆలకించి, తిరుపతి నుండి స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమ ప్రస్తానం తెలుసుకుని చల్లపల్లిని వీక్షించడానికి విచ్చేసిన ఈనాడు దినపత్రిక లో ఉద్యోగ విరమణ పొందిన దామోదర్ గారు, టీచర్ గీత గారు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శివాజీ గారు వారి స్పందనలు తెలియచేశారు.
విచ్చేసిన అతిథులకు డాక్టరు గారు, సర్పంచ్ కృష్ణ కుమారి గారు ధన్యవాదాలు తెలియజేశారు.
రేపు కలవవలసిన ప్రాంతం ఈ హైవే లోని ‘శారదా గ్రాండియర్’ వద్ద అనుకుని నిష్క్రమించారు.
కార్యక్రమానంతరం అతిధులు ముగ్గురికి బృందావన్ ఊరంతా చూపించిన తరువాత పద్మావతి ఆసుపత్రిలో స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం 10 సంవత్సరాల పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ను, వీడియోను డాక్టరు గారు చూపించడం జరిగింది. కార్యకర్తలందరినీ వీరు అభినందించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
06.09.2025.
ప్రశ్నల పరంపర – 2
అడిగి చూశా చల్లపల్లిని “ఊరి వెలుపలి బాటలన్నీ
హరిత శోభతో నిండె నెట్లని, పండ్ల చెట్లూ పూల మొక్కలు..
వందలాదిగ పెరుగుతూ కనువిందు చేయుచునున్న వేమని...”
అన్నిటికి ఒకె సమాధానం – “కార్యకర్తల కష్టమిది” అని!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
06.09.2025.