3593* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

16.09.2025 మంగళవారం 3593* వ రోజు నాటి శ్రమదాన విశేషాలు!

          జాతీయ రహదారిపై తెల్లవారుజాము 4:24 నిమిషాలకు మొదలైన నేటి కార్యక్రమం శారదా గ్రాండియర్ కు ఎదురుగా ఉన్న సువర్ణ గన్నేరు మొక్కలలో ఉన్న కలుపును, చెత్త గడ్డిని తీసివేసి విరిగిపోయిన ముళ్ళ కంపలను మొక్కలకు అడ్డుగా లేకుండా తీయడం జరిగింది.       
          క్రింది భాగంలో నీడనిచ్చు మొక్కలకు కూడా పాదులలో కలుపు లాగి మొక్కల చుట్టూ పరిశుభ్రం చేశారు. కొంతమంది కార్యకర్తలు స్వాగత ద్వారం వద్ద మట్టి కొట్టుకుపోకుండా శీలలు పాతి లోపల భాగంలో కొంత రాయి ముక్క
, తుక్కును వేసి ఆ ప్రాంతాన్ని కోతకు గురి కాకుండా చేస్తున్నారు.

          గడ్డి కటింగ్ మిషన్ తో ఒక కార్యకర్త రహదారి క్రింది భాగంలో దట్టంగా పెరిగిన గడ్డిని క్రిందికంటూ కట్ చేస్తున్నారు. మహిళా కార్యకర్తలలో కొంతమంది వచ్చిన చెత్తను పోగులుగా పేర్చడం చేయగా మరికొంతమంది కత్తులు, పంజాలు, కొడవళ్ళు చేతబట్టి గడ్డి కోసే పనిలో చాలా నైపుణ్యం కనబరిచారు.  

          6 గంటల వరకు విశ్రమించని 22 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి సెలవిచ్చి, కాఫీ సేవించిన పిదప విన్నకోట వేంకటేశ్వరరావు గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జేజేలు పలికి,

          రేపు కలవలవలసిన ప్రదేశం ఈ శారదా గ్రాండియర్ వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  16.09.2025.

          ప్రశ్నల పరంపర – 12

ఇక అప్పుడడిగా చల్లపల్లిని – “ఇతః పూర్వము లేని సొగసుకు –

స్వచ్ఛ సుందర విలాసాలకు - పారిశుద్ధ్య ప్రమాణాలకు

కారణం మా కార్యకర్తల కష్టమేనా?” అనుచు, “ఔనను”

సమాధానం తెలిసి పొందితి సంతసమ్మును నిండుగా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   16.09.2025.