3594* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

17.09.2025 బుధవారం 3594* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదానోద్యమం!

          ఈరోజు తెల్లవారుజాము 4:20 నిమిషాలకు జాతీయ రహదారికి కుడి ప్రక్కన (అవనిగడ్డ వైపు) పని చేయడానికి కార్యకర్తలు సంసిద్ధులైనారు. రోడ్డు ప్రక్కన నాటిన పూల మొక్కల చుట్టూ రోడ్డు దిగువ భాగాన ఉన్న నీడ నిచ్చు పెద్ద మొక్కల చుట్టూ కలుపు తీసి శుభ్రపరిచారు.

          స్వచ్ఛ కార్యకర్తల స్వేదం నుండి ఉద్భవించి హైవేలో దారిన పోయేవారిని అలరిస్తున్న సువర్ణగన్నేరు పూల గుత్తుల పరిమళాలు చూస్తుంటే “రహదారి ప్రక్క మొక్కనాటి పెంచరా – కల వాడు లేని వాడు నిన్ను తలచురా” అన్న పాట గుర్తుకొస్తుంది.

          కొంతమంది కార్యకర్తలు స్వాగత ద్వారంకు ఒక వైపున రోడ్డు మార్జిన్ కాస్త బలహీనంగా ఉండి, మట్టి జారిపోకుండా ఉండడానికి వెనుక పెగ్గులు పాతి మట్టి పోసి పైన GSB తో సమానంగా సరిచేయగా చూడడానికి ముచ్చటగా ఉండి ఇక్కడ ఇంత ఖాళీ ఉందా అనిపిస్తుంది.

          గడ్డి కోత యంత్రం మాత్రం రోజూ పని చేస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ చాలా భాగాన్ని కట్ చేస్తూ చల్లపల్లిలో హైవే పొడవునా అందంగా తయారు చేస్తుంది.

          6 గంటల వరకూ పని చేసిన 26 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే కాఫీ సేవించి కస్తూరి  విజయ్ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జై కొట్టి విజయ్ గారికి కార్యకర్తలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

          రేపు కలవలవలసిన ప్రాంతం ఈ శారదా గ్రాండియర్ వద్దనే అనుకుని తిరుగుపయనమయ్యారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  17.09.2025.

          ప్రశ్నల పరంపర – 13

కాలమును ప్రశ్నించి చూశా – “కదలరా మా ఊరి జనములు?

గ్రామ సేవకు – ఊరి మేలుకు - కశ్మలమ్ముల ఏరివేతకు?

ముందుకొచ్చు ముహూర్తమే”దని! “తొందరెందుకు – ఓర్పు పట్టుము

మరో రెండేళ్లు ఆగుము” అను సమాధానం లభించెను!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   17.09.2025.