3596* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

19.09.2025 శుక్రవారం 3596* వ రోజు నాటి స్వచ్చోద్యమ సంగతులు.

          హైవే లో గత 2 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలను పరిరక్షించే పనిలో భాగంగా గత 2 నెలలకు పైగా జరుగుతున్న శ్రమదాన చర్యలలో భాగంగా నేటి వేకువ 4:21 నిమిషాలకు శారదా గ్రాండియర్ వద్ద నచ్చిన పనిముట్లను చేతబట్టి కొద్ది దూరం నడవగా పనిచేయవలసి వచ్చిన చోట ఆగి, అక్కడ రహదారి దిగువన ఉన్న రెల్లుగడ్డి దుబ్బులను, పిచ్చి మొక్కలను నరికి శుభ్రం చేశారు.

          ఒక బృందం హైవే లోని రెండవ ప్రక్క (అవనిగడ్డ వైపు) సువర్ణ గన్నేరు మొక్కలకు చుట్టూ కంప కట్టి, కర్ర పాతి రక్షణగా ఏర్పాటు చేస్తున్నారు.

          కటింగ్ యంత్రంతో నిరంతరాయంగా రోడ్ మార్జిన్ ను సమానంగా కట్ చేస్తున్నారు.

          6 గంటల వరకూ పనిచేసిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి జాస్తి జ్ఞాన ప్రసాదు గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి జై కొట్టి,

          రేపు కలవవలసిన ప్రాంతం ఇదే శారదా గ్రాండియర్వద్దనే అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  19.09.2025.

          ప్రశ్నల పరంపర – 15

రాష్ట్రమున పదమూడువేల గ్రామములనూ అడిగి వేస్తిని

దేశమున ఐదారు లక్షల ఊళ్ల నన్నిటి నడుగు చుంటిని

“స్వచ్ఛ సుందర చల్లపల్లిలొ జరుగు శ్రమదానాలు మీకడ

జరుగ వెందుకు – జాప్యమే”లని! సమాధానం రాకపోయెను!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   19.09.2025.