2006*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – (200..)6* వ నాటి శ్రమ వినోదాలు  

          ఈ నాటి శుభోదయ వేళ – వేకువనే 4.00 నుండి 6.15 వరకు విస్తరించిన స్వచ్చంద కార్యకర్తల శ్రమదానం లో 32 మంది పాత్ర ఉంది. గంగులవారిపాలెం దారిలోనే – ప్రధానంగా సన్ ఫ్లవర్ దారి నుండి వీరబాబు నివాసం దాకా, ఆ పైన మురుగు కాల్వ మలుపు దాకా నెలకొన్న శ్రమదాన సందడిలోనే 22 మంది కనిపించారు. వీరు కాక స్వచ్చ సుందర కళాకారుల బృందం బందరు జాతీయ రహదారికి  ఉత్తర దిశలోని వైజయంతం (ఇంద్రుని రాచనగరు అని అర్ధం) పేరును సార్ధకం చేస్తూ – తమ సృజన దీప్తిలో మరిన్ని మెరుగులు దిద్దారు. అంతటి నిడివీ, వెడల్పు గల ప్రహరీఅందాలతో వీళ్ళింకా ఎప్పటికి తృప్తి చెంది విరమిస్తారో చూడాలి!

          కత్తులకు, దంతెలకు, చీపుళ్ళకు, కొండొక చోట గొడ్డలికి కూడ పనిచెప్పిన కార్యకర్తలు –

1) సన్ ఫ్లవర్ సిమెంటు దారి కిరుప్రక్కల కేంద్రీకృతమైన మురుగు కంపును భరిస్తూ – అక్కడ పొదల్లో పెరిగిన – అల్లుకొన్న పిచ్చి – ముళ్ళ మొక్కల్నీ, తీగల్నీ ఆ చీకట్లోనే చాకచక్యంగా తొలగించారు. (ఒక కార్యకర్త తలదీపం మురుగులో పడిపోయింది కూడ)

2) నిన్నటి – నేటి వ్యర్ధాల గుట్టలను ట్రస్టు ట్రాక్టర్ లో నింపారు.

3) మురుగు కాల్వ దగ్గరి ఖాళీ దిబ్బల మీది – తామే నరికి గుట్టలు పెట్టిన కొమ్మలు – రెమ్మల్నీ, తుక్కునూ ట్రాక్టర్ లో నింపి, డంపింగ్ కేంద్రానికి చేర్చారు. (తాటి మట్టల్ని మాత్రం మినహాయించారు – కొందరు పొయ్యిలోకి వాడుకుంటామంటే.)

          ఈ 22 మంది శ్రమ దీక్షతో ఇప్పుడు ఈ గంగులవారిపాలెం బాట మరింత విశాలంగాను, పూల రంగులతో – చెట్ల పచ్చదనంతో చూడాలని – నడవాలనిపించే విధంగాను, ఊరి ఇతర రోడ్లన్నిటికి ఆదర్శవంతంగాను  కనిపించడంలేదా? ఇందరు శ్రమ వీరుల చెమటలకు, దీక్షకు – 15 రోజుల కృషికి సత్ఫలితం దక్కలేదా? అందుకే అందరం గుర్తించుకోవలసిన సామెతలు –

          “శ్రమయేవ జయతే!”

          “శ్రమ మూలమిదం జగత్ “ అనే(క్రొత్త)వి!

ఇక్కడి ఈ రెండు చోట్ల గ్రామ ప్రయోజనకర కృషికి సమాంతరంగా నీళ్ళ టాంకరుతో ఊరిలోని వందలాది చెట్లకు ట్రస్టు కార్మికులు జీవనాధారజల మందిస్తూనే ఉన్నారు.

- చల్లపల్లి లో నిత్యం జరిగే స్వచ్చ – సుందర కృషి ఇదే!

మనకోసం మనం ట్రస్టు ఉద్యోగులు చిల్లలవాగు గట్టు మీద పండించిన నాణ్యమైన 80 మునగకాయల పందేరం ఈరోజు జరిగింది.

          రేపటి శ్రమదాన బాధ్యతలతో ఈ గంగులవారిపాలెం రోడ్డు శుభ్రతా చర్య ముగించడానికై మళ్ళీ ఇక్కడనే కలుద్దాం!

          స్వచ్చ – సుందర చందనమ్ములు ...

రేయి పగలూ ఊరి మేలుకు కలవరించిన – పలవరించిన

మురుగులెత్తిన – కసవులూడ్చిన – మొక్క పెంచిన – చెమట చిందిన

స్వార్ధరహితులు – ధన్య జీవులు – స్వచ్చ సుందర కార్యకర్తలు

అందరికి నా వందనమ్ములు – అకుంఠిత సుమ చందనమ్ములు!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శనివారం 09/05/2020,
చల్లపల్లి
.