ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1864* వ నాటి ఆచరణలు.
అసలు సిసలు చలికాలపు వేకువలో-చీకటిలో
అక్షరాల-నాల్గు నాళ్లఅద్భుత కృషి ప్రాంతంలో
విజయవాడ మార్గమందే-వేకువ నాల్గు గంటలకే-
ఆరున్నర దాకా ఈ స్వచ్చ సైన్య విన్యాసం....
30 మంది పట్టు వీడని కార్యకర్తల శ్రమదానం అంచనాలను మించి జరిగింది. చుట్టు ప్రక్కల ఒకరిద్దరు తొంగి చూచినా-వాళ్లు స్వచ్చ కృషికి రాలేదు.
విజయా కాన్వెంట్ దగ్గర విజయవంతమైన స్వచ్చ సుందరీకరణం నేటి కార్యకర్తల తొలి బాధ్యతా నిర్వహణం. ప్రహరీ గోడకు రంగుల ప్రారంభం. యథావిధిగా ఐదుగురు గ్రామ సౌందర్య కారులు తమ పద్ధతిలో రహదారి దృశ్యాన్ని మెరుగు పరచే పనిలో లీనమయ్యారు.
20 మందికి పైగా పెద్ద ముఠా నారాయణరావు నగర్ ముఖద్వార సమీప స్థల కాలుష్యం మీద దాడి చేశారు. అర ఎకరం పైగా రోడ్డు ప్రక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం లో నిన్న జరిగిన వేడుక తాలూకు రకరకాల వ్యర్ధాలను పోగులు చేసి, పనిలో పనిగా అక్కడి పిచ్చి-ముళ్ల కంపలను, గడ్డిని నరికి, ఏరి, తొలగించి, కొరడు చెట్ల కొమ్మలు కూడ నరికి, సుందరీకరించి గాని వదల లేదు. బడ్డీ కొట్టు ప్రక్కన డ్రైను నుండే మద్యం సీసాలను, ఎత్తి, సమీప చెత్త కేంద్రానికి తరలించారు.
మరికొందరు రహదారికి రెండు ప్రక్కల ఏ అందవికారాన్నీ సహించక, చీపుళ్లతో మరొక మారు స్వచ్చ శుభ్రం చేసి తృప్తి చెందారు.
కాఫీ/తేనీటి/స్వచ్చ కబుర్ల అనంతర సమీక్షా సమావేశంలో:
- విజయవాడలో 10 రోజుల నాటి చారిత్రాత్మక స్వచ్చ – హరిత వేడుకను డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు ప్రస్తావించారు. మార్గదర్శకమైన మరికొన్ని ఉదాహరణలనూ వివరించి, ఈ సాయంత్రం 7.30 కు మొదలయ్యే స్వచ్చ సుందర ప్రయాణ సన్నద్ధతలను గుర్తు చేశారు.
- తమ జ్యేష్ట పుత్త్రిక (28 వ తేదీ విజయవాడలో) వివాహ సందర్భంగా యార్లగడ్డ గ్రామ రెవిన్యూ అధికారి తూము వేంకటేశ్వర రావు – ఇందిర దంపతులు స్వచ్చోద్యమ చల్లపల్లి కి “మనకోసం మనం “ ట్రస్టుకు 5000/- విరాళం అందించినందుకు బహుథా ధన్యవాదాలు! కాబోయే వధువుకు మన ముందస్తు ఆశీర్వచనాలు!
ఎక్కువ రోజుల ఎడం తర్వాత నేటి స్వచ్చ శ్రమదానంలో పాల్గొన్న గోళ్ల ద్రోణ గారు ఇకపై తమ అందుబాటుకు భరోసా ఇచ్చి, గ్రామ స్వచ్చ-సుందర-సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించి 6.50 నిముషాలకు నేటి బాధ్యతలకు స్వస్తి చెప్పారు.
విశాఖ యాత్ర నుండి శేషించిన స్వచ్చ కార్యకర్తలు రాబోవు రెండు మూడు రోజులు ఉదయం 5 గంటల నుండి కీర్తి ఆసుపత్రి మొదలు బందరు రహదారిని స్వచ్చీకరించాలని నిర్ణయించారు.
వివరంగా ప్రకటిస్తా.
గ్రామం ప్రతి మూల మూల ప్రతి బాధ్యత స్వీకరించి
దారులుడ్చి-మురుగులెత్తి-దర్శనీయములుగ మార్చి
వినోదాలు- విజ్ఞానం విహరింపగ చేసి చూపి
స్వచ్చోద్యమ దీపాలను ప్రజ్వలింప జేశారని.....
నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
గురువారం – 19/12/2019
చల్లపల్లి.