2009* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – (200..)9* వ నాటి కొన్ని ప్రత్యేకతలు.

 

నేడు కూడ వేకువ ఏ 3.30 కో లేచి, 4.05 కే మొదలై, 6.05 దాక, (6.30 దాక కూడ) విస్తరించిన చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల అంతులేని శ్రమదాన కథ –

1) బందరు జాతీయ రహదారి ఉత్తరాన వైజయంతం దగ్గర, పొరుగు గ్రామమైన పాగోలు పరిధిలోను జరిగింది!

 

నేటి స్వచ్చోద్యమ సన్నివేశంలో పాత్రధారులు 32(+8) మంది కార్యకర్తలు, బ్రాకెట్లో ఉన్న సంఖ్య- ఆరేడు నెలలుగా ఒక్కో రోజు ఉదయం ఒక తోట చొప్పున శుభ్రం చేసే నియమం పాటిస్తున్న ట్రస్టు ఉద్యోగులది!          

పాగోలు బాటలోని “ విభాగ భవన సముదాయం” (అపార్ట్మెంట్స్) దగ్గర ఆగి, ట్రాక్టర్ నుండి పనిముట్లు, కారులోనుండి చేతి తొడుగులు, జేబుల నుండి మూతి చిక్కాలు తీసి, ధరించిన 24 మంది నిత్య నిస్వార్ధ శ్రమ దాతలు అలవాటు చొప్పున మైకు నుండి శ్రావ్యమైన- ఉత్తేజకరములైన పాటలు వింటూ- ఒకరికొకరి మధ్య దూరం పాటిస్తూ మధ్యలో ఛలోక్తులతో- చెమటకు ఒంటికంటుకుపోతున్న బట్టలతో- అలవోకగా-గంటన్నరకు పైగా ఈ బాటను స్వచ్చ-శుభ్రం చేయాలనే తమ లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఎవరికనుగుణమైన కత్తులు- పారలు-గొర్రులు-చీపుళ్లు వాళ్లు చేపట్టినా- అందరి మనసులోనిదీ ఒకటే గమ్యం- చల్లపల్లి కనుబంధంగా ఉన్న ఈ రోడ్డు మరింత శుభ్రంగా- అందంగా మారిపోవాలనే!          

ఈ అపార్ట్ మెంట్ల దగ్గరి డ్రైను లోనూ, మహాబోధి పాఠశాల వైపుగాను, విద్యుత్ శాఖ వారు వివేచనారహితంగా నరికి పడేసిన కొమ్మలు, రకరకాల తుక్కులూ, గడ్డి, పిచ్చి మొక్కలు, ఇతర వ్యర్ధాలు ట్రాక్టరు ట్రక్కుకు సరిపడా వచ్చిందంటే- అది  వారాల  తరబడి అక్కడే పడి ఉందంటే – సదరు పంచాయతీ వారి, అపార్ట్ మెంట్ల వారి నిర్లిప్తత ఏ స్థాయిలో ఉందో అర్థమౌతున్నది!         

అక్కడి నుండి నేను ఇంటికి తిరిగి వచ్చే బందరు దారిలో సుందరీకరణ బృందం సజ్జా వారి వీధి ప్రక్కన వైజయంతం తూర్పు గోడకు చిత్ర లేఖనాలు 6.30 కి ముగించడం చూశాను. దక్షిణ దిశలోని పెద్ద భారీ ఇనుప గేటు తుప్పంతా నిన్న గోకిన ఇద్దరు కార్యకర్తలు దానికి ఈ రోజు నల్ల రంగు పులుముతూ కనిపించారు.

 

            ఇద్దరు మహిళల కుంచెల నుండి బయలుదేరిన అందమైన నెమలి ఒకటి వైజయంతం తూర్పు గోడ మీదికెక్కి పురివిప్పుతూ కూర్చున్నది!

 

            ఏడెనిమిది మంది ట్రస్టు ఉద్యోగులు రోజుటి వలెనే తాము ఎంచుకొన్న వీధిని తమకు నచ్చినట్లు తీర్చిదిద్దారు.  మరో ఇద్దరు నీళ్ల టాంకరు తో ఊరి మొక్కలకు నీరందించారు....

 

            రేపటి మన శ్రమదాన కార్యక్రమాలు బందరు రోడ్డు, పాగోలు రోడ్ల వద్దే!

 

     ఉద్యమాల సాహసాలె ఊపిరిగా...

ఉత్తానం- పతనములూ ఉండును ప్రతి ఉద్యమాన

ఆకర్షణ-వికర్షణలు అవి తప్పవు దేనికైన

స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత దీనికతీతమా!

స్వచ్చ కార్యకర్తల పెను సాహసాలె కారణమా!  

 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

మంగళవారం 12/05/2020,

చల్లపల్లి.

పాగోలు రోడ్డులో