3686* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

అదే అవనిగడ్డ రోడ్డులో 26 మందితో 3686* వ నాడు!

               గురువారం వేకువ కూడ అదే సమయం - 4.20-6.15 నడుమ, అమర స్తూపం దిశగా మరో 70-80 గజాల రహదారి అలంకరణ, మళ్ళా ఆ డాక్టరే – నర్సులే  - వృద్ధులే నిష్కామ కర్ములే!

               ఈ వేకువ కురిసింది మంచో - వర్షమో కాని – రహదారి చెట్ల నుండి టపటపా మంచుబొట్లే, 6.20 తర్వాత చూస్తే తడిసిన రోడ్లే, గంటన్నరకు పైగా అమరిన శ్రమదానంతో –

               శుభ్రపడిన బాటనూ, డ్రైన్నూ, ముస్తాబైన ఈత చెట్లనూ, అసహ్యంగా కనిపించి, వ్రేలాడుతున్న తాడి మట్టల తొలగింపుతో ముచ్చటైన 70 గజాల జాగాను చూసుకొని కార్యకర్తల ఆనందమే!

               చలిని తట్టుకొని, పనుల్లో చురుకు కోసం ‘చెక్ పోస్టు బాబాయి’ అదలింపులే! ఊడ్చే నలుగురి శ్రమానందం మహిళలదే! గత తుఫానుకు విరిగి పడిన కొమ్మ రెమ్మల్ని ఏరి గుట్టలు పెట్టే వాళ్ళ శ్రద్ధా తక్కువ కాదే?

               26 వేల మంది గ్రామస్తుల బాధ్యతల్ని భుజానికెత్తుకొన్న ఈ 26 మంది కష్టమూ, స్ఫూర్తీ చూస్తుంటే “ఇలాంటి శ్రమదానం ఇంకెక్కడైనా సాధ్యమా?” అనే సందేహమే!

               గంటన్నర సమయమెలా గడిచిపోయిందో గాని, సమీక్షా సమయానికి  ముందు కాఫీలు త్రాగుతూ “ఈ రహదారి శుభ్ర - సుందరీకరణం ఇంకా వారం పది రోజులు పట్టేట్లుందే...”

      “పట్టితే పట్టనీ- మళ్లీ ఏడెనిమిది నెలల దాక ఈ రహదారి ఇలా శుభ్రంగా ఉంటుంది చాలదా?” లాంటి కబుర్లే!

               నేటి చివరి సభ సభ గాజు – ప్లాస్టిక్ బుడ్లూ, ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తుక్కులూ ఏరి, గోనె సంచీడు ప్రోగేసిన షణ్ముఖ శ్రీనివాసుని నినాదాలతో మొదలయింది.

               వివేకానంద, క్రాంతి కళాశాల యజమానులు తమ విద్యార్థుల రహదారి సుందరీకరణ సంసిద్ధతను తెలిపిన శుభవార్తతో ముగిసింది!

               రేపటి వేకువ కార్యకర్తలు కలుసుకొనేది అమరస్తూపం వద్దనే అని తెలిసింది!

               ఎవరాయాన? జవహరుడట!

ఎవరాయాన? జవహరుడట! నెలకు దశ సహస్రాలట!

చల్లపల్లి స్వచ్ఛత కై ప్రజాహ్లాద విస్తృతి కై

ఈ గ్రామస్తుల కన్నా హెచ్చు శ్రద్ధ చూపనేల?

ఆ అయాచిత సహాయానికి అంజలించక తప్పుతుందా?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    18.12.2025