3687* వ రోజు .......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3687* వ నాటి Avg. రహదారి సేవలు!

               అవి నిన్నటిలాగే ఈ శుక్రవారం (19-12-25) కూడా 4.30 కి బదులు 4.20 కి మొదలై 6.00 కు బదులు 6.20 దాక – అంటే 2 గంటలపాటు -  మంచూ చలీ విఘ్నాల్ని లెక్కచేయక సాగినవి. నిన్నటి వలెనే 26 మంది స్వచ్చ కార్మికులకే పరిమితమైనవి.

               అందులో ముగ్గురు అమరుల స్తూపం ఆవరణ శుభ్రతకే పూనుకోగా, తాము ఎంత దూరం బాగు చేశామని కాక - చేసిన మేర అద్దంలా తయారయిందా లేదా అని మాత్రమే ఆలోచించే ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు రహదారి పడమటి డ్రైను వద్ద ముళ్ళ కంపల తొలగింపులో కనిపించారు.

               తాడిచెట్ల మట్టల ఖండనకూ, ఒరిగిపోయిన ఇతర చెట్ల పునరుద్ధరణకూ కంకణం కట్టుకొన్న ముదురు కార్యకర్తల జంట ప్రసాదులకు మరో రైతు కార్యకర్త - ప్రేమానందుడు తోడవడంతో అక్కడి 4 చెట్లూ ఇప్పుడెంత పొందికగా కనిపిస్తున్నాయో గమనించండి.

               ఇక లోడింగ్ వీరులైదారుగురి గురించీ, ట్రాక్టరెక్కిన కార్యకర్త గురించీ చెప్పేదేముంది! అసలంత చలిలో - మంచులో దాహార్తితో అన్ని నీళ్లు త్రాగుతున్నారంటేనే తెలియడంలా - వాళ్ళ ఉరుకులూ, పరుగుల చురుకుదనమేమిటో?

               ఈ సంక్లిష్ట వాతావరణంలో మరీ పెద్దలూ, చీపుళ్లేసుకు రహదారి శుభ్రతకు పాటుబడే మహిళలూ ఊరికింత దూరంగా ఎందుకొస్తారా అని ఆలోచిస్తే అర్ధమయ్యేదేమంటే:

               “పాపం ఈ కార్యకర్తలంతా నిస్సహాయులు – తొలుత గ్రామ సామాజిక బాధ్యతగా మొదలైన వాళ్ళ కృషి రాన్రానూ మానలేని వ్యసనమైపోయింది. కొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారు, అప్పుడప్పుడూ మాని చూస్తున్నారు గాని - ఈ సామూహిక సఖ్యతను వదులుకోలేక, సందడిని కోల్పోలేక - ఏదో పోగొట్టుకొన్నట్లు మర్నాడు వచ్చి వాల్తుంటారు!

నేటి సభా విశేషాలివి:

-  మల్లంపాటి ప్రేమానందు గారు కార్యకర్తలకు పంచిన పర్యావరణహిత సంచులు,

- నినాదాల ప్రకటనతోబాటు - తన మనుమ సంతాన పంచల వేడుకకు (25-12-2025 – NH 216 కల్యాణ మండపంలో) కార్యకర్తలను సమాదరంగా పిలిచిన జాస్తి ప్రసాదు గారు,

               రేపటి వీధి పండుగ జరిగే గంగులవారి పాలెం వీధిలోనే వేకువ శ్రమదానమని ప్రకటించిన Dr. DRK ప్రసాదు గారు.

              అంజలించ కేం చేస్తాం?

యాభై ఏళ్ల క్రితమెపుడోవైద్య విద్య మిత్రులంట!

వందల మైళ్లు ప్రయాణించి స్వచ్చోద్యమ శ్రమదానం

చేసేందుకు వస్తారట! ఏడాదికి ఒక్కమారు!

అట్టి వైద్య నిబద్ధతకు అంజలించ కేం చేస్తాం?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    19.12.2025