పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
మంగళవారం (23.12.25) రహదారి బాధ్యత 27 మందితో! @3691*
సేవా మూర్తుల ప్రయత్నం మరొకమారు అవనిగడ్డ దారిలోని అమరుల స్థూపం వద్దనే;
సుముహూర్తం 4:30-6:20 ల నడుమనే; సేవా పద్ధతులు ఎప్పటిలాగానే –
1) థర్మోకోల్ ఫ్యాక్టరీ ముందున్న గతుకుల భాగంలోనూ, డ్రైను వైపూ పెరిగిన గడ్డి, ప్రోగుబడిన ప్లాస్టిక్ వ్యర్థాలనూ పరిహరించే పనిలో ఇద్దరు కార్యకర్తలు,
2) మృత వీర ప్రాంగణంలోని మిగిలిన గడ్డినీ, దుమ్ముకొట్టుకున్న టైల్స్ నూ తొలగించి, శుభ్రపరచడంలో మరో ఇద్దరు నిమగ్నులు,
3) ఇనుప వలల పరిరక్షిత బాహ్య భాగాలలోనూ ముగ్గుర్నలుగురు మరిన్ని శుభ్రతల సాధనలో,
4) మిగిలిన కార్యకర్తలంతా రహదారి పడమటి మార్జిన్ లోనూ, డ్రైనేజి లో తేలుతున్న రకరకాల వ్యర్థాల తొలగింపులోనూ, మళ్లీ ఆర్నెల్ల దాక పెరగకుండా గడ్డిని నున్నగా చెక్కటంలోనూ ఎంతగా లీనమయ్యారంటే - చూస్తుండగానే 20 నిముషాల్లోనే ట్రాక్టరు నిండిపోయేన్ని వ్యర్థాలు!
5) బోగన్ విలియా చెట్ల తీగల్ని కలిపి త్రాళ్లు కట్టి పొదల్లాగా మార్చడం గాని, ఎంతో పొడవైన పూల కొమ్మల్ని బాగా ఎత్తైన ఇతర చెట్ల నడుమకు చొప్పించడంలో గాని - ఆకుల కార్యకర్త చూపిన ఓర్పూ - నేర్పూ ముగ్గురం 20 నిముషాలు చూస్తుండిపోయాం! ఆ బాటన వెళ్లే ప్రకృతి ప్రేమికులెవరైనా ఆదృశ్యాల్ని చూడవచ్చు!
ప్రక్కన కోళ్ల షెడ్ల బాట నుండి జాతీయ రహదారి దాక పొడవైన రహదారి 10 రోజుల క్రిందట ఎలా ఉన్నదో గుర్తుకు తెచ్చుకోండి!
ఇతర బాధ్యతల కారణంగా - గడువుకన్న 5 నిముషాల ముందే వెళ్లిపోతున్న ఒక సీనియర్ కార్యకర్తనూ గమనించాను!
6.30 కు తుది సమావేశంలో NRI రాజేంద్రగారితో Zoom call లో ముగ్గురు సంప్రదించ సిద్ధమయ్యారని DRK గారు చెప్పారు.
నేటి నినాదాల వంతు బండి శరత్ గారిది!
అమెరికాలో M.S చదువుతున్న అనోజ్ఞ తెచ్చిన రుచి కరమైన చాక్లెట్లను, తిరుపతి లడ్డు ప్రసాదమును ట్రస్టు కార్మిక పర్యవేక్షకుడు కస్తూరి శ్రీను పంచి పెట్టారు.
ప్రతి ఏటా క్రిస్టమస్ ను దాసరి వారి ఇంటి వద్ద జరుపుకునే ఆనవాయితీ ప్రకారం రేపటి మన వీధి పారిశుద్ధ్య కృషి కమ్యూనిస్టు బజారు చివర కొనసాగుతుంది.
నా కలం కదలకా తప్పదు
తన స్వస్తత కై రమ్మని ఊరు అడగకా మానదు
కార్యకర్తలా పిలుపుకు కదలి వెళ్లకా ఆగరు
ఇంకొక పుష్కరమైనా ఈ శ్రమదానోద్యమమూ ఆగదు
అందుకు స్పందిస్తూ నా కలం కదలకా తప్పదు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
23.12.2025