2010*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 2010 వ నాటి గ్రామ బాధ్యతలు.

నేటి బ్రహ్మ ముహూర్తాన – 4.02-6.00-6.25 సమయాల నడుమ చల్లపల్లి లోని బందరు జాతీయ రహదారిలోను, పాగోలు పంచాయతీ పరిధిలోని తారు రోడ్డు కేంద్రంగాను జరిగిన స్వచ్చ- శుభ్ర- సుందరీకరణలలో మేమున్నాం- మేము చేస్తాం అని ముందు కొచ్చిన శ్రమ దాతలు 36 మంది(+ ఏడెనిమిది మంది మనకోసం మనం ట్రస్టు ఉద్యోగులు).

సాధారణంగా స్వచ్చ చల్లపల్లిలో జరిగేదెలా ఉంటుందంటే-“ ఫలాన చోట రేపటి నుండి మనం రెండు మూడు రోజులు అందంగా శుభ్రంగా చేస్తే ఎలా ఉంటుంది?.... అని దాసరి రామకృష్ణ ప్రసాదు గారు ప్రతిపాదిస్తే- కొద్దిపాటి సమాలోచనల తర్వాత- ప్రజాస్వామికంగా అందరి తీర్మానం పొందుతుంది. ఆ ఫలానా చోట మరునాడు కొత్త ఉత్సాహంతో శ్రమదానం మొదలు కావడం వరకే డాక్టరు గారి పాత్ర! కార్యకర్తల సృజనాత్మక భావాలతో- నవోన్మేష పోకడలతో అది రెండు రోజులు కాదు- రెండు వారాలు కూడ కొనసాగవచ్చు!

ఈ పాగోలు బాట సంగతీ అంతే! అపార్ట్మెంట్ల నుండి- మహాబోధి పాఠశాల మధ్యస్థ మురుగు కాల్వల గట్లు, అడ్డదిడ్డంగా పెరిగి, అల్లుకొన్న తిక్క-ముళ్ల చెట్లు, తీగల తొలగింపు కాని, చేల గట్ల మీది అస్తవ్యస్త- అనాకార తాడి చెట్ల సుందరీకరణలు గాని, చీపుళ్లతో రోడ్డును, పార్శ్వాలను ఊడ్చి,  పోగులు చేసి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించే పనులు గాని-ముందనుకొన్నట్లు రెండు కాదు-వారం రోజులు పట్టేట్లున్నది. పాగోలు, చల్లపల్లి కార్యకర్తల శ్రమ ఫలితంగా గతంలో కాలుష్యాలొక కొలిక్కి వచ్చి- అందాలు అవతరించిన ఈ దారి నేటి కార్యకర్తల కష్టంతో కొంతభాగం-150 గజాల మేర ఇప్పుడు కనువిందులు చేస్తున్నది!

ఇంక బందరు మార్గం ప్రక్కన గల వైజయంతం ప్రహరీలు, భారీ ఇనుప గేట్లు ఈ రోజు మరి కొన్ని రంగుల్నీ, సుందరీకర్తల ఊహల కనుగుణంగా క్రొత్త చిత్ర లేఖనాలను, సంతరించుకొన్నవి. సజ్జావారి వీధి ముఖ ద్వారం రూపు రేకలు మారిపోయి- ఆఖరికి విద్యుత్తు పంపిణీ దిమ్మె కూడ అందాలను చిందిస్తున్నది! ఈ కళాకారుల చిత్ర లేఖనాలకు “గోడలు-దిమ్మెలు- కావేవీ అనర్హాలు!

తాము ఎంచుకొన్న మరొక వీధి స్వచ్చ-శుభ్రతలను ట్రస్టు కార్మికులు పూర్తి చేస్తే – టాంకరు నీళ్లతో ఇద్దరు ఉద్యోగులు మొక్కలకు నీరందించారు.

పాగోలు దుర్గా ప్రసాదు గారు ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-సుందర-సంకల్ప నినాదాలతో 6.05 కు నేటి మన బాధ్యతలకు విరామం!

రేపటి మన స్వచ్చంద శ్రమదాన కర్తవ్యంలో సమీపంలోని గృహస్తులు, ఔత్సాహికులు కలుసుకోవలసిన చోట్లు- 1)మహాబోధి పాఠశాల గేటు, 2) బందరు మార్గంలోని లోని సజ్జావారి వీధి దగ్గరి వేప చెట్లు!  

 

     నాకు నమ్మక మిచ్చి చూస్తే.....

నా నిబద్ధత-నా సమర్థత-నా ఉదారత-శక్తి యుక్తులు

ఎంత పాటివొ- ఊరికోసం ఏది నే సాధించగలనో

ఐకమత్యం ఎంత గొప్పదొ తెలియ జెప్పిన స్వచ్చ సుందర

ఉద్యమానికి నా ప్రణామం! ఊరి మేలుకు రాచ మార్గం!

 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

బుధవారం 13/05/2020,

చల్లపల్లి.

4.02 కు పాగోలు రోడ్డు వద్ద