ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 2011 వ నాటి గ్రామ త్రిముఖ బాధ్యతలు.
(33+8+7) 48 మంది సమయ, త్యాగధనుల గ్రామ మెరుగుదల కృషి ఊరిలోని మూడు చోట్ల, పొరుగు గ్రామ పరిధిలో 4.01 - 6.05 సమయాల నడుమ – అంచనాల మేరకు విజయవంతంగా జరిగింది. ఏదో అలవాటు చొప్పున ఈ సంఖ్యలను, పని వేళలను నమోదు చేస్తున్నాను గాని, అన్ని రోజుల్లో ఈ కాల పరిమితులు అమలు జరగవు! నిన్న సాయంత్రం కాబోలు – కొందరు కార్యకర్తలు తమ ప్రొద్దుటి తరువాయి బాధ్యతలను పూర్తి చేస్తూ కనిపించారు!
పాగోలు రోడ్డులోని మహాబోధి పాఠశాలకు కుడి ఎడమలలో దారి రెండు ప్రక్కల – రెండు డ్రైన్లలో 30 మంది స్వచ్చ చల్లపల్లి, పాగోలు కార్యకర్తలు పోటీ పడి చెమటలు చిందిస్తూ – సీసాల కొద్ది నీళ్ళు త్రాగేస్తూ – మసక చీకట్లోనే – తమ కోసం కాక – తమ ఊరి సౌకర్యార్ధం చేసిన శ్రమదానానికి 60 పనిగంటలనో – 150 గజాల మేర అనో చెప్పగలను కాని – వాళ్ళ సామాజిక స్పృహను, శ్రమ జీవన తత్త్వ సౌందర్యాన్ని ఖరీదు కట్టలేను గదా! మైకు నుండి అశ్లీలం లేని – మానవతా విలువలను గుర్తు చేసే మంచి పాటలను వింటూ – కొందరు డ్రైనులోని, గట్టు మీది పిచ్చి – ముళ్ళ మొక్కల్నీ, గడ్డినీ తొలగిస్తే – కొందరు దంతెలతో, చీపుళ్ళతో ఆ వ్యర్ధాలను పోగులు చేసి, ట్రాక్టర్ లో నింపుతుంటే – ఒకరు ఈ శ్రమ జీవన వైవిధ్యాలను కెమెరా కంటితో చూసి – బంధిస్తుంటే – మరొకరు వచ్చే – వెళ్ళే వాహనాలను నియంత్రిస్తుంటే – “స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం” అనే పేరు సార్ధకం కావడం లేదా? వీరిలో 10 మంది పొలం గట్టు మీది ఐదారు అడ్డ దిడ్డంగా పెరిగిన – ఎండిన తాటి చెట్ల మట్టలను నరికి, సుందరీకరించి, ఆ పొలానికి రక్షకభటులేమో అన్నట్లుగా వాటిని నిలబెట్టారు.
6.00 కు కాఫీ సమయ సమావేశంలో పాగోలుకు చెందిన విశ్రాంత పంచాయితీ బిల్ కలెక్టరు, ఈ ఉభయ గ్రామాల్లో శ్రమదానానికి, ఖర్చులకీ ఎప్పుడూ ముందు నిలిచే కంఠంనేని రామబ్రహ్మం గారు మన స్పూర్తిగా ముమ్మారు వెలిబుచ్చిన గ్రామ స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలతోను, “చల్లపల్లి – నడకుదురు గ్రామ రహదారిలో ప్రజల సౌకర్యార్ధం పబ్లిక్ టాయిలెట్లు కట్టడానికి మరొక లక్ష ధనం విరాళ ప్రకటనతోను నేటి మన ఉషోదయ ఊరి బాధ్యతలకు విరామం దొరికింది!
బందరు దారిలో సుందరీకర్తలు వీధి గోడను మరికొన్ని ప్రాకృతిక దృశ్య చిత్రాలతోను, స్వచ్చ – హరిత – మౌనతపస్వినుల రూపాలతోను సర్వాంగ సుందరీకరణ చేస్తుండగా – ప్రయాణికులలో కొందరు అనివార్యంగా అక్కడ కొన్ని క్షణాలు ఆగి, చూసి వెళ్లడాన్ని గమనించాను.
రేపటి శుభోదయ గ్రామ బాధ్యతల చోటులలో ఏ మార్పులూ లేవు. బందరు, పాగోలు బాటల్లోనే!
నిజంగానే శోభపెంచిన.. .
స్వచ్చ సుందర సుసంకల్పం – స్వచ్చ సంస్కృతి నినాదం – పం
దొమ్మిదొందల నాళ్ళు పైగా ప్రతిధ్వనిస్తూ – నిరూపిస్తూ
చెప్పే ప్రతిదీ చేసి చూపీ – చేరి గమ్యం పరవశిస్తూ
స్వచ్చ సైన్యం సుదీర్ఘ సమయం చల్లపల్లికి శోభనిచ్చిందా!
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు ‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యులు,
గురువారం – 14/05/2020,
చల్లపల్లి.