2012*వ రోజు....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం : 20 – 12* వ నాటి శ్రమదాన విశేషాలు.

          యధాప్రకారమే – ప్రతి రోజు వేకువలాగే చల్లపల్లి, పాగోలు పంచాయతీల పరిధుల్లో మూడు, నాలుగు చోట్ల – రెండు గంటలకు పైగా జరిగిన శ్రమదాన భాగస్వాములు 47 మంది.  మహాబోధి పాఠశాల గేటు దగ్గర ఆగి, తమ తమ ఆయుధాలతో ఉద్యుక్తులై, అక్కడి రకరకాల కాలుష్యాల మీద పోరు సాగించిన 30 మందిలో – కొందరు పాగోలు నుండి వచ్చిన వాళ్ళు – పదవ తరగతి, ఇంటర్ విద్యార్ధులు, ఇద్దరు ఉపాధ్యాయులు, రామ బ్రహ్మం గారు.

          రోడ్డు ప్రక్కల, డ్రైన్ల లో ఈ రోజు ఎంత దూరం – ఎన్ని గజాలు శుభ్రం చేశారనే లెక్కకంటే – అసలా ప్రాంతం ఇప్పుడెంత స్వచ్చ – సుందరంగా ఉందో, అక్కడ చేసిన – చెయ్యని జాగాలను చూస్తే తెలిసిపోతుంది. మిగిలిన మరి కొన్ని తాడి చెట్ల మట్టల్ని, అల్లుకొన్న తీగల్ని, కత్తుల వాళ్ళు – దంతెల వాళ్ళు – చీపుళ్ళ వాళ్ళు ఒక సమన్వయంతో చీకట్లోనే తొలగించి, నరికి, లాగి, పోగులు చేసి, డిప్పలతో ట్రాక్టర్ లో నింపిన ఈ నిస్వార్ధ శ్రమ జీవన సుందర సన్నివేశం గురించి ఎంత వర్ణించినా తక్కువే! తాము నరికిన తాటి మట్టలు ఎండేదాకైనా డ్రైను లో ఉంచక, లోతట్టున పొలంలోకి చేర్చారు! ఇంత నిస్వార్ధంగా – సామాజిక చైతన్యంతో పనిచేసే వాళ్ళకు కుల మత రాజకీయాల ప్రస్తావనలు, కరోనా క్రిముల కష్టాలు ఎందుకుంటాయి?

          గత 35 రోజులుగా బందరు దారిలో – జమీందార్ల వైజయంతం దగ్గర సుందరీకరణ బృందం చేస్తున్న చిత్రలేఖన కళాతపస్సు నేటికొక కొలిక్కి వచ్చినట్లున్నది. రేపటి నుండి వీళ్ళ కళా దృష్టి ఏ వీధిలోని ఏ గోడ మీద పడనున్నదో మరి!       

          ఏడెనిమిది మంది ట్రస్టు ఉద్యోగులు నిన్నటి తమ ముందస్తు ప్రణాళిక ప్రకారం వీధిని శుభ్రం పరిస్తే – ఇద్దరు నీళ్ళ టాంకరు తో వేలాది మొక్కల వేసవి దాహం తీరుస్తున్నారు!

          పాగోలు గ్రామస్తుడు – మొవ్వ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీ పాగోలు శివాజీ నేటి మన శ్రమదానాన్ని సముచితంగా కొనియాడి, ముమ్మారు ఉత్సాహంగా చెప్పిన గ్రామ స్వచ్చ – సుందర – సంకల్ప నినాదాలతో 6.10 సమయంలో నేటి మన గ్రామ బాధ్యత నెరవేరింది.

          రేపటి ఐచ్చిక గ్రామ కర్తవ్య నిర్వహాణ కోసం ఇదే పాగోలు పంచాయతీ పరిధిలో – మహాబోధి పాఠశాల దగ్గరే కలుద్దాం! మరింత మందీ పాగోలు విద్యార్ధులకీ – ముఖ్యంగా సమీపంలోని చందమామ అపార్ట్ మెంట్ నివాసులకూ రేపటి ఆదర్శ శ్రమదాన బాధ్యతలకు సుస్వాగతం!

             నిబ్బరంగా – నిజంగానే?

వట్టి మాటలు వద్దనుచు – కార్యాచరణకె తాంబూలమీచ్చీ 

శ్రమైకానంద జీవన సంస్కృతిని నెలకొల్పి చూపీ

ఉన్న ఊరి ఋణాన్ని తీర్చి సమున్నతంగా నిలిపి చూపీ

నిబ్బరంగా – నిజంగానే క్రమం తప్పక స్వచ్చ సైన్యం ఉద్యమించిందా!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శుక్రవారం 15/05/2020,

చల్లపల్లి.