2013*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం : 20 – 13* వ నాటి శ్రమదానం ముచ్చట్లు.

          ఈ శనివారం వేకువ కూడ 4.05 – 6.05 సమయాల నడుమ పాగోలు దారిలోని చందమామ విభాగ భవనాల - మహాబోధి పాఠశాలల పరిసరాలలో జరిగిన స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ ప్రయత్నంలో 43 మంది, చల్లపల్లి లో మరొక ఏడెనిమిది మంది (ట్రస్టు ఉద్యోగులు) వెరసి 50 మంది స్వచ్చ కార్యకర్తల శ్రమ అక్కరకొచ్చింది!

          “ఆ(.... ఏముంది లే – ఆ మైకు పాటలు – పద్యాలేగా; ఎన్నాళ్లైనా ఆ బజార్ల ఊడ్పులేగా; ఆ డ్రైను లోని తుక్కులు – పిచ్చి మొక్కలు – ప్లాస్టిక్ తుక్కులు ఊడవడమేగా ...” అని ఈ నిత్య గ్రామ నీరాజన కృషిని తక్కువ చేసి, చప్పరించి మాట్లాడే వాళ్ళకొక నమస్కారం! నాకు మాత్రం ఈ స్వచ్చ కృషీ వలుల దైనందిన నిస్వార్ధ శ్రమదానంలో ప్రతి రోజూ ఉన్న విశేషాలు, క్రొత్త అర్ధాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ని వేల రోజులుగా అవే పనులు చేసి – చేసి, కొడితే ఈ శ్రమజీవన కార్యకర్తలకు బోరుకొట్టాలి గాని, దారిన పొయ్యే విలాస వంతులకు కాదు!

          నిజమే – “ఈ 40 మంది (విద్యార్ధులు, టీచర్లు, పెన్షనర్లు, గృహిణులు, రైతులు) కి నాలుగు రోజుల్నుండి ఈ రెండు మూడు వందల గజాల జాగా బాగు చేయడంతోనే సరిపోయిందా” అని ఎవరికైన అనిపించవచ్చు. కాని ఈ 40 మందే :

- బ్రహ్మం గారి గుడి దగ్గరి వంతెన గోడల వెలసి పోయిన రంగుల్ని ఆరేడుగురు కష్టపడి గోకి వేశారు. ఈ కల్వర్టు మరికొన్నాళ్ళకు అందమైన బొమ్మలతో – నినాదాలతో  అందర్నీ ఆహ్లాదపరుస్తుంది – స్పూర్తినిస్తుంది.

- 20 మంది కత్తుల – దంతెల ముఠా రోడ్డు దక్షిణ దిశలోని పొలం గట్టు మీద వికారంగా ఉన్న తాడి చెట్లకు అందాలు దిద్దింది.

- మరికొందరు తుక్కుల్ని , తాడి మట్టల్ని  డ్రైన్ల నుండి లాగి, డిప్పలతో ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చారు.

- నలుగురు చీపుళ్లతో – వందల మంది ప్రయాణించే ఈ రోడ్డును క్షుణ్ణంగా ఊడ్చి – శుభ్రం చేశారు.

          కిలోమీటరు దూరం నుండి ఏడెనిమిది మంది పాగోలు గ్రామస్ధులు వచ్చి – పాల్గొన్నారు గాని, దగ్గరలోని అపార్ట్ మెంటు వారు నాకు కనిపించలేదు.

          నాలుగు మార్లు సర్జరీలు జరిగిన 80 ఏళ్ల పశువైద్యుడు, పొరుగూరు శివరామపురం నుండి 79 ఏళ్ల – నిన్నటిదాక అస్వస్త విశ్రాంత ఉద్యోగి ఈ రోడ్డు సౌకర్యాల మెరుగుదలలో పాల్గొన్నందుకు అభినందించాలి!              

          ఎక్కడో అమెరికాలో ఉండి తన అమ్మమ్మ గారి 30 వ వర్ధంతి కి గుర్తుగా కార్యకర్తలదరికీ మామిడి పళ్ల పంపిణీ చేసిన నాదెళ్ళ సురేష్ నిబద్ధతకు నివాళి పట్టాలి!

          1900 రోజుల తన శ్రమదానాన్ని గుర్తు చేసి, మిగిలిన కార్యకర్తల్లో స్ఫూర్తి నింపుతూ ముమ్మారు తన గ్రామ స్వచ్చ – సుందర – సుసంకల్ప నినాదాలిచ్చిన సజ్జా ప్రసాదు గారికి అభినందనలు.

          రేపటి మన శ్రమదాన వేదిక కూడ యీ పాగోలు రోడ్డే.

           కలంధీరులు – కర్మ వీరులు.

గ్రామ సుఖముకు కర్మ వీరులు – కలం వీరులు – ఖడ్గ దారులు

మురుగు కాల్వ శ్మశాన భూముల అశుద్ధం తొలగించు ధన్యులు

రెండు వేల దినాలపైగా నిండు మనసుల నిశ్చయాత్ములు

అందరికి శిరసాభివందన – లందరికి సుమచందనమ్ములు!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శనివారం 16/05/2020,

చల్లపల్లి.