ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం : 20 – 14* వ నాటి శ్రమదాన లీలలు.
రెండు వేలు కావచ్చు- మూడు వేలు కావచ్చు- ఎన్నవరోజైనా-తమ గ్రామహిత దీక్ష తరగని, శ్రమదాన రీతి మారని 55 మంది స్వచ్చ కార్యకర్తలు(45+8+2) పాగోలు రోడ్డు లోను, నడకుదురు మార్గంలోను, వాడిపోతున్న మొక్కలున్న మరి కొన్ని వీధులలోను, జరిపిన త్రివిధ ఊరి బాధ్యతలు సవ్యంగా ముగిశాయి. 4.03 నుండి-6.05 నిముషాల నడుమ మొత్తం 100 పని గంటల కృషి స్వచ్చ కార్యకర్తలకు వన్నె తెచ్చింది. ఆత్మ సంతృప్తి అనేది వీళ్లకు – ఏ రోజు కారోజు లభిస్తూనే ఉంటుంది.
సుందరీకరణ బాధ్యులు అవనిగడ్డ- పాగోలు దారుల కూడలిలోని మురుగు కాల్వ మీది వంతెన రెండు గోడలకు వెలిసిన పాత రంగుల్ని గీకి, నిన్న కడిగిన చోట్ల-ముందుగా ప్రైమరు పులిమి, ఆరబెట్టి, రంగులు పూసే పనిలో మునిగితే- నలుగురు కార్యకర్తలు వంతెన క్రింద- పొడి బారిన మురుగు కాల్వను శుభ్రం చేశారు. ఏనాడూ కఠిన నిబంధనలు లేని ఈ స్వచ్చంద శ్రమదానంలో- ఎవరికభిమాన పాత్రమైన- అనువైన కృషిని వారు చేస్తుంటారు మరి!
ఐదారు రోజులుగా శుభ్ర పరుస్తున్నా- సుందరీకరిస్తున్నా- ఇంకా పూర్తి సంతృప్తి చెందని 30 మంది శ్రమదాతలు చందమామ నివాస విభగాలకు పడమర దిశగా ఉన్న రెండు డ్రైన్లను మరొకమారు ఊడ్చి, 70-80 మొక్కల పాదులు సరిదిద్ది- రక్షణగా ముళ్ల కంపను చుట్టూ అమర్చారు. మహాబోధి పాఠశాల ఉభయ ప్రవేశ ద్వారాల నడుమ కొందరు మహిళలు, ముఖ్యంగా పాగోలు కార్యకర్తలు 10 మంది శ్రమించారు సరే- వీరిలో పాగోలు చేతన్ అనే బుడతడు- మూడో తరగతి వాడు- చూపిన ఉత్సాహం, నాతో బాటు మరి కొందరిని కూడ ఆకర్షించింది. (స్వచ్చోద్యమం-శ్రమదానం-సమాజహితం.... వంటి మాటలేవీ ఇప్పుడర్ధం కాకపోవచ్చు- భవిష్యత్తులో వీడు తన చుట్టూ గల సమాజానికి బాధ్యుడౌతాడు!) నేటి శ్రమదాన ఫలిత సమీక్షా సమావేశంలో ఇతగాడు తన తండ్రితో కలిసి, మనకోసం మనం ట్రస్టుకు 500/- విరాళదాత కూడా! శివాజీ గారికి మన తరపున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
మూడవ రకం శ్రమదానం నడకుదురు రోడ్డు లో – రహదారి వనాలలో ట్రస్టు ఉద్యోగులు నిర్వహించారు. మరి కొన్ని వీధులలో ఇద్దరు ఉద్యోగులు టాంకరుతోలుకుంటూ చాలా మొక్కల వేసవి తాపం తీర్చారు! ఈ శ్రమదాన ముచ్చట్లు అలా ఉంచితే ఈ పాగోలు రోడ్డు డ్రైనులలో మన కార్యకర్తలు ఏరి , పోగులు పెట్టిన వందల కొద్దీ ఖాళీ మద్యం సీసాలు ఏ శ్రమజీవుల – పూట గడవని వ్యసన బానిసల బహిరంగ మద్య రసాస్వాదనల ఫలితాలో ఆలోచించాలి!
అయ్యా! నా సుదీర్ఘ శ్రమ విభాగ వర్ణనలతో కొందరు విసుగు చెందుతున్నారేమో తెలియదు గాని, సమాజంలో అరుదుగా తలెత్తే ఇలాంటి నిస్వార్ధ ఉద్యమాన్నీ, అది వేస్తున్న ప్రగతి శీలమైన ముందడుగునీ- ఈ మాత్రమైనా వివరించక తప్పదు మరి! ఈ వ్రాతలన్నీ యదార్థాలు, కళ్లెదుట జరుగుతున్న- ప్రత్యక్షంగా చూస్తే తప్ప చాలామంది నమ్మలేని-సంఘటనలు!
ఉభయ గ్రామ స్వచ్చోద్యమాల ప్రతినిధి – తూము వేంకటేశ్వరుడు ముమ్మారు ఎలుగెత్తి చాటిన గ్రామ స్వచ్చ- సుందర- సంకల్ప నినాదాలతో నేటి బాధ్యతల సంతృప్తికి ముగింపు.
రేపటి శ్రమదాన ఘట్టాలు కూడ ఈ పాగోలు మార్గంలోనే!
బ్రహ్మ శ్రీ చాగంటి ఉవాచ.
“ఎవరు నాటి రొ – నీరు పోసిరొ- ఎంత శ్రమతో పూలు పూసెనొ
పూలు త్రెంచే – పూజ చేసే- పుణ్య మార్జించగ దలంచే-
భక్తి పేరిట తిరుగుచుండే బాధ్యతెరుగని వ్యక్తులారా!
గరుడ పౌరణికం చూడుడు- కాకి, క్రోతిగ పుట్ట బోకుడు” !
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు ‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యులు,
ఆదివారం – 17/05/2020,
చల్లపల్లి.