పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
ఈ సోమవారం (13.4.26) నాటిది 3802* వ శ్రమత్యాగం!
వేకువ 4:20 – 6:06 నడుమ 27 గురి శ్రమ, సుమారు 45 పని గంటల సమయ లబ్ది నాగాయలంక మార్గంలోని బ్రహ్మం గారి గుడి, చందమామ అపార్ట్మెంట్ల ప్రాంతానిది, అందులోనూ 3 చోట్ల, 3 రకాల పనులను చూస్తూ చూపు మరల్చుకోలేకపోయాను.
బాగా బరువైన – అక్టోబరు తుఫానుకు పడిపోయిన – భారీ వృక్ష కాండాన్ని వాహన రాకపోకలకు సౌకర్యవంతంగా మాధురి, భరత్, ఆకుల దుర్గాప్రసాదాదులు ఖండించగా, ఐదుగురు బలిష్టులు ఎత్తి ట్రాక్టరులోకి వేస్తున్న వంటివి తప్ప ఈ పూట కార్యకర్తలు గుంపుగా కాక విడిగానే పనిచేశారు.
నిన్నా - నేడూ సుందరీకరణలో భాగంగా తెగిపడిన చెట్లకొమ్మల్ని కొందరు పొలంలోకి మోసుకుపోవడమూ, కస్తూరి - బృందావనులు వాటిని షెడ్దర్ నోటి కందించడమూ, నేటి స్వచ్చంద శ్రమదానంలో మరొక ఆకర్షణీయ దృశ్యం!
వంతెన గోడల మీద సుందరీకర్తల చిత్రలేఖన కళను కప్పేస్తూన్న వాల్ పోస్టర్ల - అంటుకొన్న దుమ్నూ - పేడల్ని శుభ్రపరచిన నలుగురు కార్యకర్తలు ఎంత ఓపికగా గంటన్నర పనిచేశారో చూసి తీరాలి!
బండ్రేవుకోడు కాల్వ పడమటి గట్టు బారునా, ఇటు పాగోలు రోడ్డు దక్షిణాన జరిగిన పని మాత్రం తక్కువదా? 2 రోజులు జ్వరంలో క్రాగి, జ్వరం తగ్గినా నీరసం తగ్గని కార్యకర్తలూ, కంటి శస్త్ర చికిత్సకులోనైన వారూ ఈ వేకువ సేవలకెందుకు తయారౌతారో వాకబు చేయాలి!
పాగోలు బాటలోనే 6.25 కు జరిగిన ముగింపు సభలో :
- ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేరవేయాలని వ్రాసిన సమాచారమూ,
- 11 ½ ఏళ్ల శ్రమదానోద్యమ ఖరీదూ,
- నేను నిన్నటి గుంటూరు సభలో “చల్లపల్లిలో ఏంజరుగుతోంది...” అనే మన పుస్తకాలు పంచినప్పటి అనుభవాలూ,
- సజ్జా ప్రసాదు గారు ఎలుగెత్తి చాటిన నినాదాలూ,
వంటి ముఖ్యంశాలు కాక –
రేపటి మన పనులు పాగోలు బాట ప్రారంభములోనే అని నిర్ణయం కూడ!
పరిహారం గానె సుమా!
చల్లపల్లి శ్రమదానం పరిహాసాస్పదం కాదు
ఏకాదశ వసంతాల ఇంతటి శ్రమ జరుగుతోంది-
కార్యకర్తలహర్నిశలు ఘర్మ జలం కార్చుతోంది-
గ్రామ సమాజపు తప్పుకు పరిహారం గానె సుమా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
13.04.2026