ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం : 20 – 16* వ నాటి స్వచ్చోద్యమ - చరిత్ర
నానాటికీ వికసిస్తున్న సుదీర్ఘ – నిస్వార్ధ చల్లపల్లి శ్రమదాన చరిత్రలో ఈ నాటి వేకువ 4.00 – 6.10 నడిమి సమయంలో వరుసగా 7 వ నాడు కూడ పాగోలు మార్గంలోనే కొనసాగిన స్వచ్చ ప్రయత్నం చేసిన కార్యకర్తలు (35+7+2) 44 మంది. ఈ ప్రయత్నం కూడ నాలుగైదు చోట్ల – నాలుగైదు విధాలుగా!
1) బండ్రేవు కోడు మురుగు కాల్వ మీద – సంఘ సంస్కర్త ఐన వీరబ్రహ్మేంద్రుని ఆలయం దగ్గర కల్వర్టు గోడలకు నిన్న – మొన్న వేసిన రంగుల మీద – దక్షిణపు దిక్కున ఈ రోజు అందమైన నాజూకు లతలు, పూల గుచ్చాలు ప్రత్యక్షమైనవి. కళాకారుల చేతికి ఏ వస్తువు దొరికి నా – అది కళాకృతిగా మారుతుందట! ఈ స్వచ్చోద్యమ సుందరీకర్తలు వృత్తి కళాకారులు కాకున్నా – వీళ్ళ దీక్షతో ఇక్కడి పిట్ట గోడలు ఎలా మారిపోతాయో – రెండు మూడు రోజుల తర్వాత చూడండి!
2) గడ్డి వాముల దగ్గర డ్రైనులో ఎలా లోతు పెరిగిందో గాని, రొమ్ము బంటి ఆ గుంటలో దిగి, 3 గజాల ఎత్తుకు పెరిగిన జమ్మును BSNL కు చెందిన ఒక కురచ – బక్క ఉద్యోగి నరికి, పీకి ఒడ్డున వేయడం – దానిని మరొకరు గొర్రులతో లాగి, పోగులు పెట్టడం – ఇదంతా మబ్బేసిన మసక చీకట్లోనే (ఆ దగ్గర్లోనే నిన్నా – ఈ రోజు ఒక పాము నీటిలో విహరిస్తున్నది! ) చకచకా జరిగిపోయింది.! (అసలు ఈ స్వచ్చోద్యమ సైనికుల్లో – ఇలా ఒకొక్కరి సాహసాలను వివరించాలంటే ఒక్కో గ్రంధమైపోవచ్చు.
3) మహాబోధి బడి కంచె దగ్గర – డ్రైనులో తట్టు పెద్ద గట్టు మీది 60 గజాల్లో – ఎన్నాళ్ల నుండో పెరుగుతున్న చిట్టడవి మీద ముగ్గురంటే ముగ్గురే – సాహసికులు చీకటిలోనే కత్తులతో చేసిన యుద్ధంతో తెల్లవారే పాటి కది కార్యకర్తలంతా వచ్చి చూసేంతగా శుభ్రపడింది! ఈ మొత్తం 150 గజాల గట్టునూ ఇలా శుభ్రపరిచి, త్వరలో వర్షాలు పడే నాటికి దాన్ని మరొక అందాల ఉద్యానంగా మార్చాలని వీళ్ళ ప్రయత్నం!
4) చల్లపల్లి, పాగోలు గ్రామాల 15 మందికి పైగా కార్యకర్తలు పాగోలు వైపుగా కదులుతూ రోడ్డును, అంచుల మీద సమస్త కాలుష్యాలను తొలగిస్తూ మరొక 50 గజాల ప్రాంతాన్ని మరింతగా సుందరీకరించారు.
5) నడకుదురు రహదారి వనాలలో కాబోలు ట్రస్టు ఉద్యోగులు ఇక్కడి కృషికి సమాంతరంగా తేట పరుస్తున్నారు. ఇద్దరు ట్యాంకరు నీటిని వేసవి వేడి తగులుతున్న మొక్కలకందిస్తూనే ఉన్నారు.
నాలుగు మాసాల – సకుటుంబ డెంగ్యూ బాధితులై – ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శివరామకృష్ణయ్య గారు స్వచ్చ కృషికి దూరమైనప్పటి వేదనను వెలిబుచ్చి, ఇంటి దగ్గర ఉండిపోలేక వచ్చి, కార్యకర్తల్లో చేరుతున్నా – ఒడలు వంచి పనిచేయలేని నిస్సహాయతకు చింతించి ముమ్మారు పలికిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో నేటికి మనకు విరామం.
రేపటి మన గ్రామ మెరుగుదల కృషి కోసం పాగోలు రోడ్డులోనే కలుద్దాం!
శ్రమ సుందర విజయపధం
స్వచ్చ - సుందర - చల్లపల్లి విజయ హాస మెట్టిదనిన
సామాజిక ఋణ విముక్తి సాధనకై ముందుకేగి
ఏ దేశం – ఏ కాలం – ఏ సమాజమునకైనా
ఆదర్శంగా నిలిచే అపూర్వమైన శ్రమ వేడుక!
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు ‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యులు,
మంగళవారం – 19/05/2020,
చల్లపల్లి.