ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం : 20 – 17* వ నాటి శ్రమానందల హరి!
“నిన్నటి నా అసంపూర్ణ స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ కోసం ఎప్పుడొస్తారా” అని ఎదురు చూస్తున్న మహాబోధి పాఠశాల – డా. చిరు మామిళ్ల మాధవశాయి గారి పొలం గట్ల ప్రాంతంలో 4.03 – 6.05 సమయాల నడుమ 42 మంది చల్లపల్లి, పాగోలుకు చెందిన స్వచ్చ కార్యకర్తల బాధ్యతాయుత శ్రమదానం మంచి ఫలితాలిచ్చింది. రెండు గంటల పాటు ½ కిలోమీటరు పర్యంతం ఈ పాగోలు రోడ్డంతా విభిన్న నేపధ్యాల – వయో పరిమితుల స్వచ్చోద్యమ కారుల సందడే సందడి! వీళ్ళు కాక, ఆకర్షణీయ బాటగా నానాటికీ అందాలు సంతరించుకొంటున్న ఈ రోడ్డు మీద ఉషః సమయ పాదచారులు 30 – 40 మంది, సొంత పనుల 20 – 30 మంది – వెరసి 100 మందికి పైగా మనుష్యులతో ఈ దారికి మరింత జీవకళ వచ్చింది.
- పాగోలు కార్యకర్తల్లో ఎక్కువ మంది 7 నుండి 16 ఏళ్ల వయసు పిల్లలు కావడంతో – వాళ్ళ వయసుకు తగ్గ కబుర్లతో – ఆటపాటలతో చేసిన శ్రమదాన సందడి నన్ను మరీ ఆకర్షించింది. ఇందుకు భిన్నంగా మహాబోధి బడి కంచె ప్రక్క – మురుగు కాల్వ గట్టు మీద పెరిగిన చిట్టడివిని ఐదుగురు సీరీయస్ గా నరుక్కొంటూ మరొక 50 గజాల మేర ముందుకు సాగారు. చెక్ పోస్టు, BSNL కు చెందిన ఇద్దరు మాత్రం ‘చందమామ’ దగ్గరి డ్రైనులోని మురుగు – చెత్త – నిన్న మిగిలిపోయిన జమ్ము వంటి వ్యర్ధాల పని పట్టారు. పచ్చని – చిన్న మొక్కల రక్షణార్ధం కంపకట్టే ముఠా తన దీక్షలో తానుంది. గేదెలు రుద్దకుండా పెద్ద చెట్లకు కూడ ముళ్ళ కొమ్మలు చుట్టి కట్టడం ఈ ముఠా వారి వృక్ష ప్రేమకు పరాకాష్ఠ!
- ఒక చోట కల్వర్టు గోడల చిత్రలేఖన నైపుణ్యంతో – అందరికీ మంచి నీళ్లందించే ఇద్దరితో – ఫోటోలు లాగి, సామాజిక మాధ్యమ సంతర్పణ చేసే వృద్ధునితో – చీపుళ్లతో రోడ్డు ఊడ్చుతూ – మరొక చోట లెక్కప్రకారం ఖచ్చితమైన పరిమాణాలతో కంపను నరికే చప్పుళ్లతో – మధ్య మధ్య చిట్టడవి నరికే వాళ్ళ కేకలతో --- ఈ పాగోలు దారి గంటన్నర పాటు స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ కర్మాగారాన్ని గుర్తుకు తెచ్చింది ఈ నిస్వార్ధ స్వచ్చోద్యమం రాష్ట్రంలో – దేశంలో కరోనాలాగా అన్ని ఊళ్ళకు అంటుకోవాలని కోరుకొందాం!
‘చందమామ’ అపార్ట్ మెంటు నివాసి విశ్వనాధపల్లి పార్ధసారధి గారి 1000/- విరాళానికి కృతజ్ఞతలు!
పరుచూరి అంజయ్య గారి స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప భీషణ నినాదాలతో నేటి శ్రమదాన వేడుక 6.15 కు ముగిసింది 81 ఏళ్ల సీనియర్ సర్జన్ - ఫిజీషియన్ శివప్రసాదు గారి అభినందనలతో –
రేపటి మన స్వచ్చంద శ్రమదాన వైభవం మరింత సందడిగా నిర్వహించుకోవలసిన చోటు ఈ పాగోలు రోడ్డే.
కార్యకర్తల యజ్ఞ మిది అని.
అనీతిపై ఒక యుద్ధ మెట్లో – కరోనా పై సమర మెట్లో –
సత్య శోధన నిత్య సాధన సైన్సు పరిశోధనలు ఎట్లో –
స్వచ్చ – సుందర – చల్లపల్లికి కార్యకర్తల యజ్ఞ మట్లను
అందరికి సుమ చందనంబులు – హృదయపూర్వక ప్రణామంబులు!
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు ‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యులు,
బుధవారం – 20/05/2020,
చల్లపల్లి.