2018*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం : 20 – 18* వ నాటి విశిష్టతలు.

          మహాబోధి పాఠశాల ముఖద్వారం దగ్గర 4.06 కు మొదలైన నేటి ఉషోదయ శ్రమదానం బండ్రేవు కోడు కాల్వ వంతెన దాక దారి కిరు ప్రక్కల, డ్రైను లోపలి తట్టులలో వెదకివెదకి కాలుష్యాలను తొలగించి మూడు రకాలుగా ఈ పాగోలు రోడ్డుకు సేవలందించారు. ఈ 41 మంది ఉభయ గ్రామాల కార్యకర్తల శ్రమదాన వైవిధ్యం ఇలా ఉన్నది!

- కల్వర్టు మీది దక్షిణపు గోడకు మరికొన్ని సుందరాకృతులను సమకూరుస్తూ తదేక దీక్షతో చిత్రలేఖన పరిణతిని ప్రదర్శిస్తున్న కళాకారుల విభాగం ;

- మొక్కలకు రక్షణగా ముళ్ళ కంపను పాతి, తాళ్ళతో బంధించి, కుదుళ్లను సరిచేయడంతో బాటు – పెద్ద చెట్లకు గూడ ముళ్ళ కొమ్మలు చుట్టి, పశువులు రుద్దుకోకుండ జాగ్రత్త వహిస్తున్న నలుగురైదుగురి దీక్ష!

- పాఠశాల కంచె ప్రక్కన దక్షిణపు గట్టు మీది చిట్టడవిని రెండు వైపులు – తూర్పు, పడమరల నుండి – వేప వంటి వాటిని మినహాయిస్తూ – ముళ్ళ, పిచ్చి, చెట్లను, కంపను, తీగల్ని నరుకుతున్న ఆరుగురు ధారబోస్తున్న చెమటలు ;

- రోడ్డు ప్రక్కల పిచ్చి మొక్కల్ని, గడ్డిని తొలగిస్తూ, ప్లాస్టిక్ కాగిత పొట్లాలను, సంచుల వ్యర్ధాలను ఏరి - తమ కర్తవ్యం నెరవేరుస్తున్న 8 ఏళ్ల కుర్రవాడితో సహా పది మంది పాగోలు కార్యకర్తలు;

- ఒక పర్యవేక్షకుడు, ఒక ఛాయా చిత్ర గ్రాహకుడు, మరొక మంచి నీళ్ళ పంపిణీదారుడు, చీపుళ్ళకు పనిచెప్పిన ముగ్గురు మహిళలు – ఇదంతా చూస్తుంటే చతురంగ బలాలతో సన్నద్ధమై. తమ లక్ష్య సాధన కోసం యుద్దం చేస్తున్న సుశిక్షిత సైన్యం గుర్తు రావడం లేదా? ఐతే ఇది ఏ రాజు స్వార్ధం కోసమో జరిగే సమరం కాదు; సమాజ హితం కోరి, స్వయం చైతన్యంతో కదులుతున్న స్వచ్చ సైన్యం 2018 రోజులుగా నిర్విరామంగా సాగిస్తున్న పవిత్రయుద్ధం!

          ఈ నలభై మంది కాక – ట్రస్టు ఉద్యోగులు వేరొక చోట రహదారి వనాలలో శ్రమిస్తున్నారు; వేలాది మొక్కలకు నీరందిస్తున్నారు!

          మొత్తం మీద దిస్ విల్ గో టు బి ఎ నిరంతర ప్రక్రియ!

          5.30 సమయం లో పాగోలు కు చెందిన కంఠంనేని హరి వీర ప్రసాద్, వేంకటరావు గార్లు వచ్చి, తమ గ్రామ రహదారి నూతన అందాలను, కరోనా కష్టకాలం లో గూడ అందుకై శ్రమిస్తున్న స్వచ్చ కార్యకర్తలను అభినందించి, వారి తండ్రి కంఠంనేని వేంకటకృష్ణయ్య (93) గారి పేర మనకోసం మనం ట్రస్టుకు 10,000/- విరాళమిచ్చారు. ఈ దారినే కాదు, చల్లపల్లి కి చెందిన ప్రతి దారిని, స్వచ్చ – శుభ్ర – సుందర దృశ్యాలను తిరిగి చూసి, ఆనందించారు.

          3 వ తరగతి కుర్రవాడు చేతన్ నినాదాలు చెప్పటమే కాక – తన అక్క పాగోలు మొక్ష నాగ చైతన్య జన్మదిన సందర్భంగా బిస్కట్లు – చాక్లెట్లు పంచాడు – ఇదే నేటి నిస్వార్ధ శ్రమజీవన సౌందర్య విలాసం!

          రేపటి మన సమాజ ఋణ విముక్తి స్థానం కూడ ఇదే – పాగోలు రోడ్డే!

         స్వచ్చ సుందర ధన్యగ్రామం.

అక్ష్యరాస్యులుకాని మహిళలు, వృత్తినిపుణులు పెద్ద వైద్యులు,

రాజకీయులు, కళాకారులు – గ్రామ సేవలకే నిబద్ధులు

అరదశాబ్దం కలిసి సాగుట, ఐకమత్యం వీడకుండుట

చల్లపల్లి కె సాధ్యమైనది – స్వచ్చ సుందర ధన్యమైనది!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

గురువారం 21/05/2020,

చల్లపల్లి.

5.30 సమయం లో పాగోలు కు చెందిన కంఠంనేని హరి వీర ప్రసాద్, వేంకటరావు గార్లు వచ్చి, తమ గ్రామ రహదారి నూతన అందాలను, కరోనా కష్టకాలం లో గూడ అందుకై శ్రమిస్తున్న స్వచ్చ కార్యకర్తలను అభినందించి, వారి తండ్రి కంఠంనేని వేంకటకృష్ణయ్య (93) గారి పేర ‘మనకోసం మనం’ ట్రస్టుకు 10,000/- విరాళమిచ్చారు. ఈ దారినే కాదు, చల్లపల్లి కి చెందిన ప్రతి దారిని, స్వచ్చ – శుభ్ర – సుందర దృశ్యాలను తిరిగి చూసి, ఆనందించారు.