పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?
3870* వ శ్రమ సందడి(ఆదివారం-21.6.2026)!
సందడి ఒక అగంతకునితో సహా 43 మందిది, వేకువ 4.19 -6.05 నడుమ జరిగినది, ఉరుములు - మెరుపులతో భయపెట్టినా వర్షం పడక – చల్లగా మాత్రం ఉండి, సాఫీగా నాగాయలంక బాటలోని బ్రహ్మంగారి మఠానికటు వంతెన దాకనూ, ఇటు పాగోలు వంతెన కేంద్రంగానూ ఎక్కువ మంది కార్యకర్తలు కష్టించినది!
గ్రామ పశ్చిమ వీధి మలుపులో మెరికల్లాంటి ఐదారుగురు కార్యకర్తలు మన్ను - ధూళి గుట్టను త్రవ్వి, 2 వ వైపు రోడ్డెక్క జూస్తున్న మురుగు కాల్వను అదుపులో పెట్టారు.
చెట్ల అలంకరణ దారుడు – ఆకుల వీరుడు నిర్విరామంగా మర రంపం వాడి, క్రమం తప్పిన కొమ్మల్ని శిక్షిస్తూనే ఉన్నాడు.
మొన్నటికే రహదారి పనులు విజయవంతంగా ముగిసినా, కోడూరు, అంబటి ద్వయమూ, మోతుకూరి సోదర త్రయమూ వీధి అందాలకు నగిషీలు చేస్తూనే ఉన్నారు.
భాగ్యనగర TCS ఉద్యోగి, చుట్టపు చూపుగా చల్లపల్లి వచ్చిన వల్లభనేని వీరేంద్ర కుమారుడూ ఎక్కడ అవసరమనుకొంటే అక్కడికి వెళుతూ సమాజ కర్తవ్య పాలన చేస్తూనే ఉన్నాడు.
తూము వెంకటేశ్వరుల వారు పని జరిగే ప్రతి చోటుకూ- ఆఖరుకు పాగోలు రోడ్డు వంతెన లోతట్టున మురుగు కాల్వ అంచున జరిగే 7 గురి వద్దకూ పోయి, ఫొటోలు తీస్తూనే ఉన్నారు.
దగ్గరగా వచ్చి పరిశీలించని వాళ్ళకేమో- “3 రోజుల్నుండీ ఆ100 గజాల రహదారి పనులేనా” అనిపించవచ్చు. కాని-
అక్కడ క్షుణ్ణంగా జరుగుతున్న శుభ్ర - సుందరీకరణలనూ, ప్రతి కార్యకర్త ముఖంలోని పట్టుదలనూ జాగ్రత్తగా చూస్తే గదా వివరం బోధపడేది!
చల్లపల్లి శ్రమదాన ప్రత్యేకతేమిటో అవగతమయేది!
ఇక – స్వచ్చ – సుందరోద్యమ సాంప్రదాయం ప్రకారం జరిగే తుది సమావేశం సంగతి కొస్తే-
దాన్ని తన నినాదాలతో ప్రారంభించి, సొంత అభిప్రాయం చెప్పని భోగాది వాసు,
వీర సింహుని 20 వేల చందాను మొక్కల కొనుగోలుకు వాడాలనుకొని, కడియం వెళ్లి మంచి మొక్కల్ని 70 వేలకు కొనాల్సివచ్చిందనే,
అనంత్ అంబానీ 70 లక్షలతో తాడి చెట్టును కొన్నాడనే,
ఈ మధ్యాహ్నం RK కళ్యాణ మండపం లో శ్రీమతి సబ్బినేని బోసు గారి సంస్కరణకు వెళ్లాలనే,
శ్రమదానానికి దిగుటను
ఆదర్శం అని కొందరు, దైనందిన జీవితమున
బోరు విముక్తికి కొందరు, పూర్తి నిబద్ధతతో కొందరు
సందడికై మరికొందరు, జాగృతులై ఇంకొందరు
శ్రమదానానికి దిగుటను చాల మార్లు చూస్తున్నా!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
21.06.2026