3924* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

3924* (శుక్రవారం -14.8.26) నాటి శ్రమదాన సమాచారం-

               ఆ సమాచారానికి ముందుగా ఒక చిన్న విషయం - రోజువారీగా - 7:30 & 8:00 మధ్య నాపాటికి  నేను ఇంట్లో కూర్చొని ఆ 30-40 మంది సామూహిక సత్కార్యాలను నెమరువేసుకుంటూ, వాళ్ల శ్రమనూ, సమయదానాలనీ లెక్కలు కట్టుకొంటూ వ్రాసుకుపోతున్నాను.

               ఈ స్వచ్చోద్యమానితో అంతగా భౌతిక సంబంధం లేని కొందరు గ్రామస్తులతో బాటు సురేష్ నాదెళ్ళ వంటి ప్రవాసులు ఈ వ్రాతలను చదివి సంతోషిస్తున్నారు! ఏ ముగ్గురు నలుగురో తప్ప స్వచ్ఛంద శ్రమదాతలు కూడ చదువుతున్నారనీ తెలిసింది!

               వారిలో కొద్దిమందికి మాత్రం – “నిజమే! ఇంతటి చారిత్రాత్మక శ్రమదానం - ఇంత సుదీర్ఘ కాలం - ఒక ఊరిలో జరగడం విశేషమే! కార్యకర్తల నిత్య కఠిన శ్రమా కాదనలేని సత్యమే కాని - ఏదో మనకు తోచిన మంచిని చేసి ఊరుకోక - ఇలా వ్రాసుకుంటూ ప్రచారం చేయడం అవసరమా!” అనిపిస్తున్నదనీ తెలిసింది!

               తొలి శ్రమదానరోజుల్లో మన అందరి ఆలోచన అదే! కానీ జర్నలిస్టు మిత్రుల పట్టుదలతోనే ఇది రాష్ట్రమంతటా ప్రచారం జరిగింది; దీని ప్రభావంతోనే 30-40 గ్రామాల్లో సామాజిక బాధ్యతలు మేల్కొన్నాయి; శ్రమదానం కాస్తా శ్రమ సందడిగా మారింది. రాన్రానూ స్వచ్ఛ కార్యకర్తలు కళాకారులుగా, కవులుగా, గాయకులుగా మారుతూనే ఉన్నారు; క్రమక్రమంగా ఇక్కడొక సామాజిక - సామూహిక - శ్రమ సంస్కృతి రూపుదిద్దుకొంటున్నది! కనుక దీన్నంతా శుభ పరిణామంగానే భావిద్దాం!

               ఈ వేకువ కూడ వీధి ఊడ్పుతో బాటు, చెట్ల ట్రిమ్మింగ్ వంటి సుందరీకరణతో బాటు, చిల్లలవాగు వంతెన ప్రాంతం కార్యకర్తల శ్రమలను పీల్చుకొని, ఆ చెమటల చలువతో అందంగా మారడం గమనించా౦ గదా! వాగూ - వంతెనల నడుమ సాధనాల సతీష్ సాధించిన కళాకృతులూ, పూల మొక్కలూ “కుసింత కలాపోసన” ఉన్న వచ్చే - పోయే వందలాది మనుషుల మనసుల్ని అటుగా లాగేస్తున్నాయి కదా!

               ఎంత శ్రమతో - ఖర్చుతో - అద్భుతమైన శ్మశానానికి తగినట్లుగా దాని ముఖద్వారమైన తరిగోపుల ప్రాంగణం తయారౌతున్నదో చూస్తుంటిమి గదా! ఇలాంటి నేటి 33 మంది శ్రమజీవన సౌందర్యానికి సాక్షీభూతులమయ్యాం చాలదా?

               ఈ నిస్వార్ధ శ్రామిక సౌందర్యాన్నే గదా 6.20 కాలంలో DRK గారు తన మాటలతో ఆవిష్కరించినది? సతీష్ సాధనాల తన త్రివిధ నినాదాలతో ఎలుగెత్తి చాటినది?

               రేపటి వేకువ కూడ ఈ శ్మశాన ముఖద్వారపు సేవలకే మరి - డాక్టర్ గారు ప్రతిపాదించినది!

               పొగడేందుకొ – తెగడేందుకొ

ప్రత్యేక శ్రమ చరిత్ర వాస్తవములు కవితలతో -
ఉన్న నిజం దాచకుండ - లేనివి కల్పించకుండ
గ్రంథస్థం చేయడమే గానీ – పనిగట్టుకొనీ
పొగడేందుకొ - తెగడేందుకొ పూనిక కాదని మనవి!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   14.08.2026