2032* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2032* వ నాటి వీధి శుభ్రతా చర్యలు.

 

ఈ జూన్ మాసం 4 వ తేదీన- వేకువ 4.00 కూడ కాక ముందే బందరు రహదారి మీద-ATM సెంటరు దగ్గర ప్రారంభమై-6.05 వరకూ 27 మంది స్వచ్చ కార్యకర్తల గ్రామ బాధ్యతా నిర్వహణం నాగాయలంక రోడ్డు లోని పెట్రోలు బంకు దాక కొనసాగింది.  ఈ ప్రాంతానికదనంగా గంగులవారిపాలెం దారిలోను, వీళ్లకు అదనంగా ట్రస్టు కార్మికుల మరికొన్ని సేవలు కూడ జరిగినవి.

 

రోడ్లు- ముఖ్యంగా గ్రామ ప్రధాన వీధుల్ని ఊడవడం గాని, వాటి ప్రక్క వెల వెలపోతున్న గోడల్ని, దిమ్మెల్ని, ట్రాన్స్ ఫార్మార్ లని , స్తంభాలను సుందరీకరించడం గాని- ఈ స్వచ్చ కార్యకర్తలకేమీ క్రొత్త కాదు- 2030 రోజులుగా ఏ ఒక్క నాడైనా ఆగని దినచర్యే. మురుగు కాల్వల్లో దిగడమూ, రోడ్ల గుంటలు పూడ్చడమూ- అన్నీ యధావిథిగా జరుగుతున్నవే! వేసవి మండిపోనీ, వాన ముసురులు మురిగిపోనీ – కరోనా కాలు దువ్వనీ-వీళ్ళకేం లెక్కలేదు! ఏ రోజూకారోజు వీళ్ల శ్రమదానం మాత్రం నాకు ఆశ్చర్యజనకమే.

 

- ATM కేంద్రమూ, దాని ప్రక్కన టిఫిన్ సెంటరూ, 10 మందికి పైగా కార్యకర్తలకు 2 గంటల పాటు పని కల్పించింది. రెండు దేవాలయాలూ, 2 కూరల దుకాణాలూ, ఇతర షాపులూ గతంలో కన్న కొంత మెరుగుగా ఉన్నా- అవి కూడ ఏడెనిమిది మందికి – ఊడ్చే, ఏరే, పని చూపాయి.

 

- కొందరు పోలీస్ స్టేషన్ దారిని శుభ్రం చేశారు. మిగిలిన వారు ఉభయ పెట్రోలు బంకుల, బేకరీల, సైకిల్ షాపుల, మూడు రోడ్ల కూడలి మూల మూలల్లోని దుమ్ము కాగితాలు, తదితర వ్యర్ధాల పని చూసుకొన్నారు.

 

- రెస్క్యూ ముఠాకు వేరే చోట లభించిన మట్టిని గంగులవారిపాలెం దారిలో సర్దే పని తగిలింది.


- కోడూరు(చెక్ పోస్టు) వేంకటేశ్వర రావు గారి నెలవారీ స్వచ్చోద్యమం చందా 520/- ఠంచనుగా  అందంగా- ధన్యవాదపూర్వకంగా మనకోసం మనం ట్రస్టు స్వీకరించింది.

 

ఇవన్నీ కాక- మరొక గమనార్హమైన  ప్రస్తావన జరిగింది: రాష్ట్ర  గైనకాలజిస్టుల సంఘాలు” బాధ్యతాయుత వైద్యులుగా మీరు సమాజానికేమి చేస్తున్నారు”.....? అనే ప్రశ్నకు స్పందించిన డా. టి. పద్మావతి గారు-2030 రోజులుగా చల్లపల్లి స్వచ్చ సైన్యంలో తన పాత్రను, ఫోటోలతో సహా వివరించగా – నమ్మశక్యంగానీ ఈ సుదీర్ఘ స్వచ్చోద్యమాన్నీ, కార్యకర్తలను వారు పదే పదే అభినందించారు.

 

గౌరుశెట్టి (BSNL) నరసింహా రావు గారి ఆరోగ్యదాయక వివరణాత్మక-గ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో నేటి స్వచ్చంద శ్రమదానం ముగిసింది.

 

రేపటి వీధి శుభ్రతా బాధ్యత కోసం కరీముల్లా దుస్తుల దుకాణం దగ్గర కలుద్దాం!

 

               కొలవ లేనిది-తూచలేనిది

స్వచ్చ సేవను కొలువగలమా-స్ఫూర్తి లెక్కలు తేల్చగలమా!

ఉద్యమం ఈ సమాజానికి ఊతమిచ్చుట తూచగలమా?

సమాజం ఎడ వ్యక్తి బాధ్యత చక్కబెట్టుట నచ్చి, స్వచ్చో

ద్యమానికి ప్రణమిల్ల రండిక అయ్యలరా! అమ్మలారా!

 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

గురువారం – 04/06/2020,

చల్లపల్లి.