2076* వ రోజు....

 చల్లపల్లి స్వచ్చోద్యమంలో – 2076* వ నాడు.  

            ఈ బుధవారం (25.11.2020) నాటి వేకువ 4.25 నుండి 6.10 దాక నెరవేరిన గ్రామ బాధ్యతా నిర్వహణలో సమీకృతులైన స్వచ్చంద కార్యకర్తలు 20 మంది. ఆశ్చర్యకరంగా నేటి వీధి శుభ్రతా విధులలో (బహుశా ఆసుపత్రి ఉద్యోగినులు తప్ప) మహిళా కార్యకర్తల ప్రమేయం లేదు. ఒక ప్రక్క వాతావరణ శాఖ నుండి తీవ్ర తుఫాను హెచ్చరికలున్నా, గత ఆదివారం నాటి నిర్ణయం మేరకు చల్లపల్లి – బందరు జాతీయ రహదారిలో – ఆ నాటి గ్రామ కర్తవ్య పునశ్చరణగా – మసీదు నుండి షాబుల్ వీధి వరకు మరొక మారు ఈ 20 మంది సామాజిక బాధ్యతా విన్యాసాలు జరిగినవి.

            చీపుళ్లతో వీధి శుభ్రతలు కాక, డ్రైన్లను కమ్మేస్తూ పెరుగుతున్న గడ్డిని కోసి, చెక్కి పీకడం కాక, వివిధ పరిమాణాల ప్లాస్టిక్ సంచుల్ని, ఖాళీ మద్యం సీసాలను, పుల్లా పుడకల్ని పోగులు చేసి ఏరడం కాక ఈ దినం గంటన్నరకు పైగా జరిగిన మరొక పెద్ద ప్రయత్నం – మూడు రోజుల్నుండి ఎండిన డ్రైను బురదను, రాళ్ళను డిప్పలతో ట్రక్కులోనికెక్కించి, భారత లక్ష్మి వడ్లమర దారి ప్రక్క గుంటలను సరిజేసి, ఆ సిమెంటు బాటకు, ప్రయాణికులకు భద్రతను, సౌకర్యాన్ని కల్పించడం. బహుశా ఇంకొక్క రోజు రెండు ట్రక్కుల మట్టి – రాళ్ళ మిశ్రమంతో సదరు వీధిలోని పక్కా దారికి, ప్రయాణికులకు పూర్తి సౌలభ్యం కలగవచ్చు.

            చల్లపల్లి ప్రధానవీధులను ఊడ్చి, గోడలను విభిన్న వర్ణ చిత్ర రంజితం కావించి, డ్రైన్ల పారుదలకు బాధ్యత వహించి, గ్రామ శుచి, శుభ్ర, సౌందర్యాలను పెంచుతూ, రహదారుల రక్షణకు కూడ పాటు బడుతున్న ఈ స్వచ్చ కార్యకర్తలకు కావలసింది పొగడ్తలు కాదు; గ్రామస్తుల కృతజ్ఞత కూడా కాదు. ఎవరి వీధిలో, ఎవరి డ్రైనులో, ఎవరి ఇంటి పరిసరాలలో వారు స్వచ్చ – సౌందర్యాలను నిర్వహించుకోవడమే!

            తుఫాను ముందరి చలిగాలుల్ని లెక్క చేయక – తదేక దీక్షతో గ్రామ ప్రధాన వీధి పారిశుధ్య బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలకు అభినందనలు! కరోనా హెచ్చరికల నేపధ్యంలో మనం మరొక మారు మనం నమ్మిన ఆదర్శం కోసం వచ్చే శనివారం  - అనగా 28.11.2020 ఉదయం 4.30 కు సంత బజారు సమీపంలో – బందరు మార్గం లోనే కలుసుకొందాం!

 “నాకోసం నేను” – V – “మనకోసం మనం”  

స్వచ్చ రమ్య చల్లపల్లి విజయ పధం బెట్టిదనిన....

సామాజిక ఋణ విముక్తి సదాశయ స్ఫూర్తితోడ

“నీకోసం నీవు కాదు” – “మనకోసం మన” మంటూ

ఊరుమ్మడి బాధ్యతకై ఉరకలెత్తు సాహసం!

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

25.11.2020.