స్వచ్చ - సుందరోద్యమ చల్లపల్లిలో … 2078* వ నాడు.
కొంత ఆహ్లాదకరమైన ఈ ఆదివారం శుభోదయాన – 4.24 వేకువ సమయాన – 12 మంది కార్యకర్తలతో మొదలై, క్రమంగా 30 మంది దాక సమీకృతులై 6.10 దాక జరిగిన గ్రామ పారిశుధ్య బాధ్యతలతో శుభ్ర – సుందరీకృత ప్రాంతం బైపాస్ మార్గంలోని కమ్యూనిస్ట్ వీధికి ఉభయ దిశలలో గల సుమారు అర కిలోమీటరు. గ్రామస్తుల స్వస్తతా భవితవ్యమే – సమాజహిత సానుకూల దృక్పధమే సదాశయంగా 6 – 7 సంవత్సరాలుగా చల్లపల్లిలో ప్రవర్తిల్లుతున్న ఈ స్వచ్చోద్యమానికి కరోనా విలయం తాత్కాలిక విరామమే తప్ప శాశ్వత నిరోధం కాదు. ఆశయం సమాజ హితమైతే – ఆచరణం ఆచి తూచి అడుగేస్తే – కార్యకర్తల అవగాహన విస్తృతమైతే – గ్రామంలోని అన్ని వర్గాల సహకారం తోడైతే, ఏ ఉద్యమమైనా ఇలాగే విజయవంతం కాక తప్పదు!
నేటి స్వచ్చతా విధుల విశేషాలు ప్రస్తావించాలంటే :
- ఈ బైపాస్ మార్గంలోని సిమెంటు దారి ప్రక్కన మరి కొంతదూరం గరిక, తుంగ, ఇతర గడ్డి, పిచ్చి మొక్కలు తొలగిపోయినవి. ఈ గడ్డిని పారలతో చెక్కే సమయంలో వచ్చిన దుమ్ము – ధూళి – ఇసుక, ఊడ్చిన మట్టి – ఇసుక మిశ్రమాలు పాతికకుపైగా డిప్పలలో రహదార్ల గుంటలు పూడి, సురక్షితంగా – అందంగా మారినవి.
- అసౌకర్యంగా, అందహీనంగా పెరిగిన రహదారి వృక్షాల కొమ్మలు తొలగి, అందంగా మారినవి. ఆ వనాలలోని, ఎదుటి ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలు కార్యకర్తల చీపుళ్ళ వల్ల ప్రోగులై, ట్రస్టు ట్రాక్టర్ లోనికి, తరువాత డంపింగ్ కేంద్రానికి చేరినవి.
- సజ్జా ప్రసాదు గారి వీధి దారికిరుప్రక్కల గడ్డి, పిచ్చి, ముళ్ళ మొక్కలు కూడ చాల వరకు తొలగిపోగా, బాట విశాలంగా – శుభ్రంగా కనిపిస్తున్నది.
- బైపాస్ మార్గంలోని నేటి ఈ స్వచ్చ – శుభ్రతలు 25 మందికి పైగా స్వచ్చ కార్యకర్తల గంటన్నర శ్రమసముపార్జితాలు! డాక్టర్ రామకృష్ణ ప్రసాదు గారు పదేపదే ప్రస్తావించే
“స్వచ్చ కార్యకర్తల సంపూర్ణ ఆత్మ సంతృప్తిదాయకాలు!”
6.15 సమయంలో యధావిధిగా కాఫీ పానీయ సేవనము, డి.ఆర్.కె. గారి అభినందన పూర్వక సమీక్ష, కార్యకర్తల పిచ్చా – పాటి స్వచ్చ కబుర్లు, తదుపరి రోజులలో ఎక్కడ – ఎలా మన బాధ్యతల నిర్వహణము ఉండాలి వంటివన్నీ జరిగినవి.
తదనంతర స్వచ్చ విధుల కోసం మనం మరొక మారు బుధవారం నాడు – అనగా 2-12-2020 వేకువ 4.30 కు ఈ ఉప (బైపాస్) మార్గంలోనే – భారత లక్ష్మి ధాన్యం మర వీధి దగ్గర కలువ వలసి ఉన్నది.
భూమాతకు రక్షణం
వికటించి ప్రపంచీకరణం వినియోగపు పెనుభారం
భరింపరాని కాలుష్యం ప్లాస్టిక్ సంచుల శాపం
ప్రతి పల్లెలో స్వచ్చ సేన ప్రకటించాలొక సమరం
అపుడే ఈ భూమాతకు పర్యావరణ రక్షణం!
నల్లూరి రామారావు,
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు
29.11.2020.